తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ అప్​డేట్స్​: భాజపాలోకి సింధియా

madhyapradesh
'కాంగ్రెస్​కు భయమేమీ లేదు.. బలపరీక్ష నెగ్గితీరతాం'-లైవ్

By

Published : Mar 11, 2020, 10:58 AM IST

Updated : Mar 11, 2020, 3:30 PM IST

15:28 March 11

సంతోషకర దినం

జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరడంపై స్పందించారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా ప్రధాన నేత శివరాజ్​సింగ్ చౌహాన్. పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఈ రోజు సంతోషకర దినమని వ్యాఖ్యానించారు. సింధియాలకు రాజకీయాలంటే ప్రజాసేవ చేసేందుకు ఓ మాధ్యమం మాత్రమే అని అభివర్ణించారు.  

15:17 March 11

జైపుర్​కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజస్థాన్​ రాజధాని జైపుర్​కు చేరుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రిసార్టులో దిగారు. విశ్వాసపరీక్ష జరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించారు అగ్రనేతలు.   

15:08 March 11

'నా జీవితాన్ని మార్చినవి రెండే ఘటనలు'

భాజపాలో చేరాక తొలిసారి ప్రసంగించారు జ్యోతిరాదిత్య సింధియా. తన జీవితాన్ని రెండే ఘటనలు మలుపుతిప్పాయని పేర్కొన్నారు. ఒకటి తన తండ్రి మరణం కాగా రెండోది ఆయన 75వ జయంతి రోజున నూతన జీవితాన్ని ప్రారంభించడమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాసేవ చేసేందుకు అవకాశం లేకే పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. భాజపాలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు సింధియా కృతజ్ఞతలు తెలిపారు.

14:54 March 11

భాజపాలో చేరిన సింధియా

మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో కీలక నేత, గ్వాలియర్ రాజవంశ వారసుడు జ్యోతిరాదిత్య  సింధియా భాజపాలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు  కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. 

14:31 March 11

భాజపా కార్యాలయానికి సింధియా

భాజపా కార్యాలయానికి చేరుకున్నారు జ్యోతిరాదిత్య సింధియా. మరికాసేపట్లో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతులమీదుగా భాజపాలో చేరనున్నారు.  

14:27 March 11

'సింధియావి అవకాశవాద రాజకీయాలు'

సింధియా కాంగ్రెస్​ను వీడటంపై స్పందించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. ఇలాంటి అవకాశవాద రాజకీయ నేతలు ముందే పార్టీని వీడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ 18 ఏళ్లపాటు సింధియాకు అవకాశాలు కల్పించిందన్నారు. పార్టీకి ద్రోహం చేసిన సింధియాకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

14:18 March 11

భాజపా కార్యాలయానికి బయల్దేరిన సింధియా

కాంగ్రెస్​పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా దిల్లీలోని స్వగృహం నుంచి భాజపా కేంద్ర కార్యాలయానికి బయల్దేరారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. 

14:06 March 11

విశ్వాస పరీక్ష నెగ్గుతాం: దిగ్విజయ్ సింగ్​

22 అసమ్మతి ఎమ్మెల్యేల్లో 13 మంది భాజపాలో చేరేందుకు విముఖత వ్యక్తం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. వాళ్లు కాంగ్రెస్​ను వదిలి వెళ్లరని.. కమల్​నాథ్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుందని స్పష్టం చేశారు.  

13:38 March 11

భాజపా పోస్టర్లపై సింధియా చిత్రాలు

సింధియా భాజపాలో నేడు చేరనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​లోని భిండ్​లో పోస్టర్లు వెలిశాయి. కాషాయ వర్ణంలో ఉన్న బ్యానర్లలో సింధియాతో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చిత్రాలు ఉన్నాయి. 

12:38 March 11

నడ్డా నేతృత్వంలో సింధియా కాషాయ తీర్థం..

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జ్యోతిరాధిత్య సింధియా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. భాజపా ప్రధాన కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది. అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారన్న సమాచారం నేపథ్యంలో వారి చేరికపై స్పష్టత కొరవడింది.

12:30 March 11

బెంగళూరు రిసార్టు ముందు హైడ్రామా

రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఉన్న బెంగళూరు రిసార్టు ముందు కర్ణాటక కాంగ్రెస్ యువత విభాగం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పార్టీని వీడటం అన్యాయమని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో  ఆందోళనకారులను రిసార్టు వద్ద నుంచి పంపించివేశారు పోలీసులు.

12:21 March 11

'సింధియాతో వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేరు'

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్​సింగ్ బెంగళూరులోని రిసార్టులో నేడు భేటీ అయినట్లు తెలిపారు. సింధియాతో వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తమను తప్పుదోవ పట్టించి బెంగళూరుకు తీసుకొచ్చారని ఎమ్మెల్యేలు వెల్లడించినట్లు స్పష్టం చేశారు.

12:05 March 11

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్

బెంగళూరు క్యాంప్​లోని పదిమంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు  సింధియాతో కలిసి భాజపాలో చేరేందుకు విముఖతతో ఉన్నారని సమాచారం. సింధియా నూతన పార్టీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మేం సింధియా కోసమే వచ్చామని భాజపాలో చేరేందుకు కాదని వారు అభిప్రాయపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

11:59 March 11

'ఎమ్మెల్యేలు తిరిగి వస్తారు'

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం కమల్​నాథ్ తనయుడు నకుల్​ నాథ్​.. తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. బెంగళూరు క్యాంపులో ఉన్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలో  చేరతారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కొనసాగుతుందని నమ్మకం ఉన్నట్లు పేర్కొన్నారు.

11:46 March 11

జైపుర్ రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పయనం

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యులు 80మంది జైపుర్​లోని రిసార్టుకు పయనమయ్యారు. భోపాల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయల్దేరారు. మరికాసేపట్లో జైపుర్​కు చేరుకోనున్నారని సమాచారం.

11:35 March 11

జైపుర్​లో కాంగ్రెస్ క్యాంప్

మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 80మంది ఎమ్మెల్యేల కోసం రాజస్థాన్ రాజధాని జైపుర్​లోని రిసార్టులో క్యాంపు సిద్ధం చేశారు. మరికాసేపట్లో ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకుంటారని సమాచారం.

11:24 March 11

పీఎంఓ లక్ష్యంగా రాహుల్ ట్వీట్

మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలపై ట్విట్టర్​లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 'మీరు మధ్యప్రదేశ్​లో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నప్పుడే 35 శాతం చమురుధరలు తగ్గాయి. తగ్గిన ధరల ప్రయోజనం భారత ప్రజలకు చేకూరేలా చర్యలు తీసుకోండి' అని పీఎంఓ లక్ష్యంగా ట్విట్టర్​లో పేర్కొన్నారు.

11:14 March 11

నేడు భాజపాలో చేరనున్న సింధియా

కాంగ్రెస్ బహిష్కృత నేత జ్యోతిరాధిత్య సింధియా.. నేడు దిల్లీలోని భాజపా కార్యాలయం వేదికగా కాషాయతీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సింధియా భాజపా కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.  

10:55 March 11

ప్రభుత్వానికి ప్రమాదం లేదు

కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు వచ్చిన ప్రమాదమేమీ లేదన్నారు మధ్యప్రదేశ్ హోంమంత్రి బాల బచ్చన్. ప్రతిఒక్కరూ ముఖ్యమంత్రితో సంభాషిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయని వెల్లడించారు. శాసనసభ విశ్వాసపరీక్షలో నెగ్గితీరతామన్నారు.

10:31 March 11

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారుపై జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో ప్రభుత్వ మనుగడ అయోమయంలో పడింది. సింధియా వర్గానికి చెందిన 22మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాజీనామా చేశారు. సోమవారం సింధియాను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భాజపా అధ్యక్షుడు నడ్డాతోపాటు ప్రధాని మోదీ, అమిత్​ షాతో భేటీ అయిన కారణంగా సింధియాపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది.  

22మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో శాసనసభలో బలపరీక్ష జరగొచ్చన్న అంచనాల మధ్య కాంగ్రెస్, భాజపాలు అప్రమత్తమయ్యాయి. ఇరుపార్టీలు నిన్న శాసనసభాపక్ష భేటీలు నిర్వహించాయి. కాంగ్రెస్ సమావేశానికి వందమంది ఎమ్మెల్యేలతోపాటు నలుగురు స్వతంత్రులు సైతం హాజరుకాగా.. 22మంది రెబల్ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం.  

తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సజ్జన్‌సింగ్‌ వర్మ, గోవింద్‌ సింగ్‌లను బెంగళూరు పంపిన కాంగ్రెస్.. ముందు జాగ్రత్తగా తమ సభ్యులను నేడు జైపుర్ తరలించనుంది. భాజపా సైతం తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్​లోని ఐటీసీ గ్రాండ్​ భారత్​లో ఉంచింది.

​230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ శాసనభలో ఇప్పటికే రెండు ఖాళీలు ఉండగా 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సభ్యుల సంఖ్య 206కు తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 104మంది అవుతుంది. ప్రస్తుతం భాజపాకు 107మంది సభ్యుల బలం ఉంది. కమలదళం అనుకున్నట్లు అన్ని సవ్యంగా జరిగితే శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సింధియాకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది.

Last Updated : Mar 11, 2020, 3:30 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details