మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. పోలింగ్‌లో చివరి గంటను ప్రత్యేకంగా కరోనా రోగులకు కేటాయించారు అధికారులు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన నిబంధనల నడుమ పోలింగ్ చేపట్టనుంది ఎన్నికల సంఘం.
రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిసారిగా రికార్డు స్థాయిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో 12 మంత్రులు సహా.. మొత్తం 355 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 19 జిల్లాల్లో జరగనున్న ఈ పోలింగ్ కోసం సుమారు 33వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్టు తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి అరుణ్ తోమర్. 250 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 173 మంది స్టాటిక్ నిఘా బృందాలు, 293 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
మొత్తం 63.67 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు తోమర్. ఇందుకోసం 9,361 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని.. వాటిలో 3,038 కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు ఆయన తెలిపారు.
మరికొన్ని రాష్ట్రాల్లోనూ..
- ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. మొత్తం 88 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఏడు స్థానాల్లో గతంలో భాజపా-6, సమాజ్‌వాద్ పార్టీ-1 సీట్లు దక్కించుకున్నాయి. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి అజయ్ కుమార్ శుక్లా చెప్పారు. అయితే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హాథ్రస్, బల్రామ్పుర్ హత్యాచార ఘటనల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎంతవరకు సజావుగా సాగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
- కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రెండు స్థానాలకు గానూ.. ఏకంగా 31 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,008 పోలింగ్ కేంద్రాల్లో.. మొత్తం 6.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే.. అశోక్ గస్తీ మరణానంతరం ఆ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి డిసెంబర్ 1న ఉప ఎన్నిక జరగనుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
- ఛత్తీస్‌గఢ్‌లోని మర్వాహీ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఒక్క స్థానం కోసం 8 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 286 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 1,90,907 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరిగే ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరగనుంది.
ఇదీ చదవండి:ఎన్నికల ప్రచారానికి సినిమా హంగులు