తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మట్టి'ని తయారు చేసిన ఇస్రో.. పేటెంట్‌ హక్కు సొంతం - lunar soil made by ISRO

చంద్రుడిపై ఉండే మాదిరి మట్టిని తయారు చేసింది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). చంద్రమృత్తికను కృత్రిమంగా తయారుచేసే విధానాన్ని కనుగొన్నందుకు.. ఇస్రోకు పేటెంట్‌ హక్కులను మంజూరు చేసింది భారత మేధోహక్కుల కార్యాలయం (ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌). ఈ హక్కులు ఇరవై సంవత్సరాల పాటు ఉంటాయి.

Made in India moon soil Indian space research organisation gets patent
ఇస్రో చంద్ర మృత్తికకు... పేటెంట్‌ హక్కులు

By

Published : May 21, 2020, 6:00 AM IST

చంద్రుడిపై ఉండే మాదిరి మట్టిని తయారు చేసింది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). తమ ఆవిష్కరణకుగాను తాజాగా మేధోహక్కులను పొందింది. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారుచేసే విధానాన్ని కనుగొన్నందుకు భారత మేధోహక్కుల కార్యాలయం (ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌) ఇస్రోకు పేటెంట్‌ను మంజూరు చేసింది.

ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి అంటే మే 15, 2014 నాటి నుంచి ఇరవై సంవత్సరాల పాటు ఉంటాయి. ఈ ఆవిష్కరణలో ఇస్రోకు చెందిన ఐ. వేణుగోపాల్‌, ఎస్‌.ఏ. కన్నన్‌, వి. చంద్రబాబులతో పాటు... పెరియార్‌ విశ్వవిద్యాయానికి చెందిన ఎస్‌.అంబజగన్‌, ఎస్‌. అరివళగన్‌, సీ.ఆర్‌. పరమశివం, ఎం.చిన్నముత్తు ఉన్నారు. వీరితో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుచిరాపల్లికి చెందిన కె. ముత్తుకుమరన్‌ తదితరులు భాగస్వాములయ్యారు.

చంద్రమృత్తిక ఎందుకు?

భారత్‌ గతంలో తలపెట్టిన చంద్రయాన్ కార్యక్రమంలో విక్రమ్‌ మూన్‌ ల్యాండర్...‌ చంద్రునిపై దిగే‌ సమయంలో విఫలమైంది. పట్టువీడని భారత్‌ చంద్రునిపై కాలుమోపేందుకు మరో ప్రయత్నం చంద్రయాన్‌-2కు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగాల్లో భాగంగా విక్రమ్‌ లాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీది ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది.

చంద్రుని ఉపరితలం భూఉపరితలం కంటే పూర్తి భిన్నంగా ఉండటం వల్ల కృత్రిమంగా చంద్రుడి ఉపరితలాన్ని సృష్టించి... రోవర్‌, ల్యాండర్‌లను పరీక్షించాల్సి వస్తుంది. ఈ ప్రయోగాలకు సుమారు 60 నుంచి 70 టన్నుల చంద్రమృత్తిక అవసరమవుతుంది. చంద్రుని ఉపరితలాన్ని గురించిన శాస్త్రీయ పరిశోధనలకు ఇది చాలా ఆవశ్యకం. భవిష్యత్తులో భారత్‌ తలపెట్టనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు కూడా భారీ పరిమాణంలో చంద్ర మృత్తికను పోలిన మట్టి అవసరమౌతుంది.

భవిష్యత్తులో చందమామపై ఆవాసాలను ఏర్పర్చుకునేందుకు చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన భౌతిక, రసాయనిక స్వరూపాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఐతే అమెరికా నుంచి చంద్రమృత్తికను దిగుమతి చేసుకోవటం వీలయినప్పటికీ, ఇది చాలా ఖరీదైన వ్యవహారం. ఈ నేపథ్యంలో చంద్రమృత్తికను దేశీయంగా తయారుచేయటమే పరిష్కారమని శాస్త్రవేత్తలు భావించారు.

తమిళనాడులో..

చంద్ర శిలలను పోలిన అనార్ధోసైట్‌ శిలలు తమిళనాడులోని సేలం వద్ద ఉన్నట్టు అక్కడి భూగర్భ శాస్త్రజ్ఞులు తెలిపారు. చివరకు సీతంపూడి, కున్నమలై గ్రామాలలో లభించే అనార్ధోసైట్‌ శిలలను చంద్రమృత్తిక తయారీలో వినియోగించేందుకు నిర్ణయించారు. వాటిని నిర్ణీత పరిమాణాల్లోకి మార్చి ల్యూనార్‌ టెర్రయిన్‌ టెస్ట్‌ ఫెసిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు బెంగుళూరు తరలించారు. అలా తయారైన ఆవిష్కరణ అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉందని, తయారుచేసిన మన్ను అపోలో 16 చంద్రుని నుంచి తీసుకువచ్చిన నమూనాలతో పోలి ఉందని శాస్త్రజ్ఞులు తేల్చారు.

ఇదీచూడండి:తీరం దాటిన అంపన్-బంగాల్​లో ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details