మార్కెట్లలో తక్కువ ధరకు దొరికే వస్తువులు ఏవి? అంటే చైనా ఉత్పత్తులని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. అందుకే చైనా బజారుల్లో రూపాయి నుంచే వస్తువులు దొరుకుతాయి. మరీ చీప్ ధరలకే లభించే మన్నిక లేని ఉత్పత్తులతో మనకు ఏ మేర నష్టం జరుగుతుందో తెలుసా? వాళ్లు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో హానికర రసాయనాలతో తయారు చేసిన వస్తువులను మన మార్కెట్లలోకి వదులుతున్నారని తెలుసుకున్నారా?
బొమ్మల్లో కాడ్మియం..
చైనా బొమ్మలు చూడటానికి రంగురంగుల్లో ఉండి పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి. తక్కువ ధరే కావడం వల్ల మనం కొనేసి వారి చేతుల్లో పెట్టేస్తుంటాం. అయితే దానితో ఎంత చేటు జరుగుతుందని అనుకుంటున్నారు. ఆ బొమ్మల్లో శరీరానికి హాని కలిగించే కాడ్మియం ఉంటుంది. ఈ రసాయనం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాసకోస సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ ఉత్పత్తుల్లో వాడే హానికారక రసాయనాల వల్ల క్యాన్సర్ ముప్పు తప్పదు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఓ సర్వే ప్రకారం.. దిల్లీ మార్కెట్లలో దొరికే చైనా వస్తువుల్లో దాదాపు 67 శాతం కనీస నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయాయి.
బ్యూటీ కోసం చూసుకుంటే...
యువతీ యువకులు వాడే సౌందర్య ఉత్పత్తులనూ చాలా చీప్‌గా, తక్కువ ధరలకే తయారు చేస్తాయి చైనా సంస్థలు. ఆ ఉత్పత్తుల కాల పరిమితి 6 నెలల నుంచి 12 నెలలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కార్సినోజెనిక్ జిగురు, పీవీసీ, ఫార్మల్డీహైడ్తో వాటిని ప్యాక్ చేయడమే కారణం. ఇలాంటి నాసిరకం బ్యూటీ ఉత్పత్తులే రోజూ విపరీతంగా అమ్ముడవుతున్నాయి. భవిష్యత్తులో వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.