తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​- చైనా సరిహద్దు సమస్యకు అసలు కారణమేంటి? - ఇండో చైానా సరిహద్దు వివాదం

భారత్-చైనా‌ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్దాఖ్‌లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కమాండర్‌ సహా 20 మంది సైనికులు మరణించటం దేశప్రజల గుండెల్ని బరువెక్కించింది. అంతేకాక నియంత్రణరేఖ వెంబడి ఉద్రిక్తతను పెంచింది. 1962 తరువాత ఇరు దేశాల మధ్య ఈ స్థాయిలో స్నేహసంబంధాలు దెబ్బతినటం ఇదే తొలిసారి. ఈ పరిస్థితుల్లో.. అసలు సమస్యకు కారణమేంటి? భౌగోళికత, ఇరుదేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు ఎటువైపునకు దారితీస్తాయి?

Lt Gen D S Hooda, former chief of northern command ON LAC
భారత్​-చైనా సరిహద్దు సమస్యకు అసలు కారణమేంటి?

By

Published : Jun 21, 2020, 8:29 PM IST

గల్వాన్​ లోయ ఘటనలో 20మంది భారత సైనికులను పొట్టనబెట్టుకుంది చైనా. ఇన్నేళ్లల్లో ఎన్నడూ లేని విధంగా దురాగతానికి పాల్పడింది. ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మరింత ప్రభావం చూపుతుంది. అసలు చైనా ఇంతటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టింది?

నియంత్రణ రేఖ-ఎల్​ఏసీ:

1962లో చైనాతో జరిగిన యుద్ధంలో పశ్చిమ లద్దాఖ్‌లోని 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆ దేశ సైన్యం ఆక్రమించుకుంది. ఆ ఆక్రమిత సరిహద్దు భూభాగాన్ని వాస్తవాధీన రేఖ -ఎల్​ఏసీగా భావిస్తారు. దాన్ని రాజకీయ మ్యాపుల్లో చూపించకపోవటం, అధికారికంగా సరైన సరిహద్దులు నిర్ణయించకపోవటం వల్ల నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో భూభాగంపై హక్కు కోసం ఇరుదేశాలు కొన్నాళ్లుగా తగాదా పడుతున్నాయి.

భారత్‌, చైనా సైన్యాలు ఎల్​ఏసీ వెంబడి ఎప్పుడూ గస్తీ నిర్వహిస్తూనే ఉంటాయి. ఎక్కడైతే సరిహద్దు భూభాగానికి సంబంధించి విభేదాలు వస్తాయో ఆయా చోట్ల సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొంటుంది. అయితే చాలా మట్టుకు ఇవన్నీ శాంతియుతంగానే పరిష్కారమవుతాయి. ఆ సమయంలో ఇరువైపులా సైనికులు ప్రవర్తించాల్సిన విధివిధానాలపై ఒప్పందాలు, ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు 2013లో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందంలోని ఆర్టికల్‌ 8లో "ఉద్రిక్తతల సమయంలో ఇరుదేశాల సైనికులు పరస్పరం ఎదురైనప్పుడు సాధ్యమైనంత వరకూ శాంతియుతంగానే సమస్యను పరిష్కరించుకోవాలి. దాడి జరగకుండా నియంత్రించాలి. రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. ఆయుధాలు వాడతామని గానీ, లేదా వాడండి అని గానీ బెదిరించకూడదు. ఇరువైపులా గౌరవించుకుంటూనే ఆయుధాలు వాడకుండా, తుపాకీలు పేల్చకుండా సాధ్యమైనంతవరకూ నియంత్రించాలి" అని ఉంది.

ఈ కఠిన నిబంధనలను ఇరువైపులా గౌరవించడం వల్లే 1975లో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించిన తరువాతి నుంచి ఇప్పటివరకూ ఎల్​ఏసీలో శాంతి వాతావరణానికి విఘాతం కలగలేదు. అయితే ఈ ఏడాది మే నెల మొదటి వారంలో చైనా అకస్మాత్తుగా దాడికి యత్నించినప్పటి నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారింది.

తూర్పు లదాఖ్‌ భౌగోళికం:

తూర్పు లదాఖ్‌ భౌగోళికం

లద్దాఖ్‌ సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉంటుంది. టిబెటిన్‌ పీఠభూమికి ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని తూర్పు లద్దాఖ్‌గా పిలుస్తారు. పాంగాంగ్‌ సరస్సు, గల్వాన్‌ నదీ లోయ సముద్రమట్టానికి 14వేల అడుగుల ఎత్తులో ఉంటే.. వేడినీటి బుగ్గ 15వేల 500అడుగుల ఎత్తులో ఉంది. ఈ మూడు ప్రాంతాల్లోనే భారత్‌-చైనా సైనికుల మధ్య తరచూ ప్రతిష్టంభన ఏర్పడుతోంది. ముఖ్యంగా పాంగాంగ్‌ త్సో, గల్వాన్‌ ప్రాంతాల్లో ఎక్కువ ఉద్రిక్తత ఉంటుంది. పాంగాంగ్​ సరస్సు ఉత్తర ఒడ్డులో ఉన్న భూభాగంపై చైనా, భారత్‌కు భిన్నాభిప్రాయాలున్నాయి. మ్యాపులోని ఫింగర్‌-4 మీదుగా నియంత్రణ రేఖ పోతుందని చైనా వాదిస్తుండగా... తూర్పు అభిముఖంగా మరింత ముందుకెళ్తే వచ్చే ప్రాంతమైన ఫింగర్‌-8 మీదుగా వాస్తవాధీన రేఖ ఉందని భారత్‌ వాదిస్తోంది. వివాదాస్పదంగా ఉన్న ఏ ప్రాంతాన్ని అయితే చైనా తమదని చెబుతోందో ఇప్పుడు దాన్నే అది ఆక్రమించుకుంది. భారత్‌ చెబుతున్న సరిహద్దు వెంబడి గస్తీ నిర్వహించే వీలు లేకుండా ఆ మార్గాన్ని చైనా అడ్డుకుంది.

పాంగాంగ్​ సరస్సు

గల్వాన్‌ లోయ వెంబడి ఉన్న సరిహద్దు రేఖ.. భారత్‌ భూభాగంలో ఉన్న అత్యంత కీలకమైన రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దారి .. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వైమానికతలం దౌలత్‌ బేగ్‌ ఓల్దీ(డీఓబీ) వరకూ వెళ్తుంది. దర్బూక్‌ నుంచి 255 కిలోమీటర్లు సాగి డీబీఓ దగ్గర ముగిసే ఈ మార్గం నిర్మాణం 20 ఏళ్ల కిందట ప్రారంభమైనప్పటికీ సైనిక అవసరాలకు పూర్తిస్థాయిలో ఎప్పుడూ ఉపయోగపడలేదు. ష్యోక్‌ నదిపై శాశ్వతమైన వంతెన లేకపోవటమే దీనికి కారణం. 2019లో పూర్తయిన ఈ వంతెనను రక్షణ మంత్రి ప్రారంభించారు. సైనికులకు ఆహారంతో పాటు ఉత్తర లద్దాఖ్‌కు సైనికులు, సైనిక సామగ్రి తరలింపులో ఈ రోడ్డు కీలక భూమిక పోషించటం వల్ల ఆర్మీకి ఇది వ్యూహాత్మకంగా మారింది. చైనా సైన్యం గల్వాన్‌ లోయ గుండా మన భూభాగంలోకి ప్రవేశిస్తే ఈ కీలక మార్గాన్ని మూసివేయవచ్చు. జూన్‌ 15న ఈ తరహాలో జరిగిన ఘర్షణే 20 మంది సైనికుల మరణానికి దారితీసింది.

గల్వాన్​ ప్రాంతం

పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది?

గతంలో చాలా సార్లు చైనా సైన్యం చొరబాటుకు యత్నించింది. 2013లో దెప్సాంగ్‌, 2014లో ఛుమార్‌, 2017లో డోక్లాంలో సైనిక ప్రతిష్టంభనలకు ఆ చొరబాట్లే కారణం. అయితే ఇవన్నీ స్థానిక ఘటనలు కావటం వల్ల ఎటువంటి హింస లేకుండానే సమస్య పరిష్కారమైంది. కానీ మొన్న జరిగిన ఘటన మాత్రం వీటికి పూర్తిగా భిన్నమైనది.

సరిహద్దు వెంబడి పలు రంగాలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తిగా చైనా ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. హింసకు తెగబడుతూ చైనా సైన్యం చొచ్చుకురావటం గతంలో లేదు. మొన్న జరిగిన ఘర్షణలో ఇరు సైన్యాలను నియంత్రించ గలిగే ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ పూర్తిగా పనికిరాకుండా పోయాయి. చైనా తాజా తీరు మన నిబంధనలను తప్పనిసరిగా పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరించింది. మరింత దూకుడుగా మనం వ్యవహరించేందుకు సిద్ధపడాల్సి ఉంది. ఇది సరిహద్దు నిర్వహణపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది కూడా. భవిష్యత్తులో మనం ఉద్రిక్తత సరిహద్దునూ చూడాల్సి రావొచ్చు, అతిసమీప భవిష్యత్తులో అయినా అది జరుగుతుందనే అనుకుంటున్నా.

ఈ పరిస్థితుల్లో స్వభావం, నాణ్యత పరంగా ఇండో-చైనా సంబంధాలూ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక భావోద్వేగమూ కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతలకు ఏ రూపంలోనైనా పరిష్కారం లభించినా... సైనిక శక్తిని ఉపయోగించి దేశాన్ని బెదిరించాలనే చైనా యత్నాన్ని మాత్రం భారతీయులు అంత సులభంగా మర్చిపోలేరు.

--- డీ. ఎస్​‌ హుడా, లెఫ్టినెంట్‌ జనరల్

ABOUT THE AUTHOR

...view details