బ్రాహ్మణులపై స్పీకర్ ప్రశంసలు.. చెలరేగిన దుమారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుచిత వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణులు ఎల్లప్పుడూ సమాజంలో ఉన్నత స్థాయిలోనే ఉంటారని ఆదివారం రోజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు బిర్లా. రాజస్థాన్ కోటాలో ఇటీవల జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సమావేశానికి హాజరైన లోక్‌సభ స్పీకర్ పై వ్యాఖ్యలు చేశారు.
దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సభాపతి వ్యాఖ్యలు కులాల మధ్య అసమానతలు రెచ్చగొట్టేలా ఉన్నాయని... దీనిపై వెంటనే క్షమాపణలు చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ విమర్శ...
పుట్టుకతోనే బ్రాహ్మణులకు గౌరవం ఉంటుందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. కానీ.. 'మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారని గౌరవం ఇవ్వడం లేదని.. దేశంలో గౌరవప్రద లోక్సభకు సభాపతిగా వ్యవహరిస్తున్నారని గౌరవం ఇస్తున్నట్లు' ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
లోక్‌సభ స్పీకర్ బిర్లా వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీలు ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు.
అన్ని కులాల ప్రజలు భారతదేశంలో సగర్వంగా, సమానంగా బతికేలా రాజ్యాంగం అవకాశం కల్పించిందని ఓవైసీ మాట్లాడారు.
'రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం'
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూఎస్ఎల్) సంస్థ స్పీకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచింది. రాజ్యాంగపరంగా ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆరోపించింది. ఈ విషయాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.
బ్రాహ్మణులకు అనుకూల వ్యాఖ్యలు చేసిన బిర్లా.. 'మనమంతా ఐక్యంగా ఉండాలని అప్పుడే ఉన్నత స్థాయిలోకి చేరుకుంటామని అన్నారు. ప్రస్తుతం దేశంలో మనమే అందరికన్నా ముందున్నామని సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలంటూ' వ్యాఖ్యానించారు.