రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానంలో గందరగోళం, ఈపోస్ యంత్రాల్లో పేర్లు రాకపోవటం కారణంగా పలు ప్రాంతాల్లో రేషన్ సరుకులు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన సూచనలు చేశారు కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాసవాన్. ఆధార్ లేదనే కారణంతో రేషన్ కార్డులో ఎట్టిపరిస్థితుల్లోనూ పేరు తొలగించొద్దని కోరారు.
ఎఫ్ఎస్పీ దుకాణాల నిర్వహణ, ఆధార్ అనుసంధానంపై లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు పాసవాన్. ఆధార్ అనుసంధానం విఫలమైన క్రమంలో పౌరసరఫరాల ద్వారా అందే వస్తువులను పొందేందుకు తగు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
"ఆధార్ కార్డు లేదనే కారణంగా రేషన్ కార్డు నుంచి కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు లేదా ఆహారధాన్యాల తిరస్కరణ వంటివి ఉండకూడదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నాం. జాతీయ స్థాయిలో 81.5 శాతం లబ్ధిదారులు, 86 శాతం రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం జరిగింది. "