ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో మరో 10 ఏళ్లపాటు రిజర్వేషన్లు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణకు లోక్సభ నేడు ఆమోదం తెలిపింది. సభలో ఉన్న 352మంది సభ్యులు రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపారు. వ్యతిరేక ఓట్లు ఎవరూ వేయలేదు. ఆయా సామాజిక వర్గాల్లో నూతన రాజకీయ నాయకత్వాన్ని సృష్టించేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
గత 70 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగబద్ధమైన ఈ నిబంధన.. 2020 జనవరి 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించింది ప్రభుత్వం. అయితే నామినేటెడ్ సభ్యులుగా చట్టసభల్లోకి వస్తోన్న ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్ పెంపుపై రాజ్యాంగ సవరణలో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు సర్కారు.
మోదీ హాజరు..
రాజ్యాంగ సవరణ బిల్లు అయిన కారణంగా ఓటు విభజన ద్వారా సభ్యులు తమ మద్దతును తెలిపారు. ఓటింగ్ సందర్భంగా సభకు హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.