ప్రపంచాన్ని కాలు కదపనీయకుండా చేసిన ఈ కరోనా కాలంలో.. వైరస్‌ను మన ఒంటిపై వాలనీయకుండా రక్షణ కల్పిస్తూ కాస్త ధైర్యం నింపుతున్నాయి వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ). అయితే, ఇన్నాళ్లు పీపీఈ కిట్లు అంటే ఒక్కసారి వాడి పడేసే పరికరాలు మాత్రమే. కానీ, ఇకపై ఒక్క పీపీఈ కిట్ వైరస్ నుంచి మళ్లీ మళ్లీ రక్షణ కల్పించనుంది. అవును, బెంగళూరులోని లాయల్ టెక్స్టైల్ మిల్స్ లిమిటెడ్ .. భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, స్విట్జర్లాండ్‌కు చెందిన హెచ్ఐక్యూ సంస్థలతో కలిసి పునర్వినియోగానికి అవకాశమున్న సూపర్ షీల్డ్ పీపీఈ కిట్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ సూపర్ షీల్డ్ పీపీఈ కిట్లను వాడిన తర్వాత.. ఉతికి ఆరేసి మళ్లీ వాడొచ్చు. ఈ కిట్లు సురక్షితమా కాదా అనే సందేహం అక్కర్లేదంటున్నారు ఉత్పత్తిదారులు. ఎందుకంటే.. ఆర్/ఎలాన్ ఫీల్ ఫైబర్‌తో తయారు చేసిన ఈ కిట్లు, సూక్ష్మ జీవులు, వైరస్‌లను తట్టుకోగలవని అధికారిక పరీక్షల్లో తేలింది. ఇక అధునాతన సాంకేతికతతో ఆవిష్కరించిన ఈ కిట్లు కరోనా వైరస్ సార్స్-కోవ్-2(కొవిడ్-19)ను 99.99 శాతం అంతం చేస్తున్నట్లు రుజువైంది.