దేశంలో కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు ముద్రించడం వల్ల వస్తోన్న విమర్శలపై కేంద్ర విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఈ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలో ప్రస్తావించిన నేపథ్యంలో దీనిపై ఆ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. భద్రతా చర్యల్లో భాగంగా నకిలీ పాస్‌పోర్టులను గుర్తించేందుకు ఇలా జాతీయ చిహ్నాన్ని గుర్తించినట్టు స్పష్టం చేశారు. అలాగే, ఇతర జాతీయ చిహ్నాలను రొటేషనల్ పద్ధతిలో ఉపయోగిస్తామని వెల్లడించారు.
కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన కొత్త పాస్‌పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్‌సభలో జీరో అవర్ సమయంలో లేవనెత్తారు. దీన్ని పత్రిక ప్రముఖంగా ప్రచురించిందనీ.. కమలం భాజపా గుర్తు గనక దాన్ని ప్రచారం చేసుకొనేందుకు ఇలా చేస్తోందంటూ ఆయన ఆరోపించారు.