దేశవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. శివనామ స్మరణతో ప్రముఖ శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి దేవదేవుడిని దర్శిచుకుంటున్నారు. భారీగా భక్తజనుల తాకిడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలతో ఆలయ ప్రాంగణాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కాశీ విశ్వనాథ, గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ఉజ్జయినిలోని శ్రీ మహా కాళేశ్వరాలయంలో ఆదిదేవుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
దేశమంతా 'హరహర మహాదేవ శంభోశంకర' - తెలుగు తాజా వార్తలు
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశమంతటా 'శివోహం' అంటూ శివనామ స్మరణ వినిపిస్తోంది. ఈ సందర్భంగా కాశీ, ఉజ్జయిని తదితర పుణ్యక్షేత్రాల్లో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్త సందోహంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి.
గింజలతో 25 అడుగుల శివలింగం
పంజాబ్ అమృత్‌సర్ లోని శివాలయ బాగ్‌భయాన్ ఆలయాన్ని శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అంగరంగంవైభవంగా అలంకరించారు. కర్ణాటకలోని కలబురగిలో స్థానికంగా లభించే గింజలతో 25 అడుగుల ఎత్తు శివలింగాన్ని రూపొందించారు. బ్రహ్మకుమారీలు నిర్మించిన ఈ శివలింగానికి 300 కేజీల గింజలు అవసరమయ్యాయి. మరోవైపు.. మహా శివరాత్రి సందర్భంగా... కళాకారులు... ఒడిశా పూరీ తీరంలో పరమేశ్వరుడి 11 సైకత శిల్పాలను రూపొందించారు. ఓం నమఃశివాయ అనే సందేశంతో మహాశివున్ని స్మరించారు.