తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థి నేత నుంచి లోక్​సభ స్పీకర్ వరకు..​ - మోదీ

రాజస్థాన్​లోని కోటా-బూందీ ఎంపీ ఓం బిర్లాను.. అనూహ్య రీతిలో లోక్​సభ స్పీకర్​ అభ్యర్థిగా అధికార పార్టీ ప్రకటించింది. మిత ప్రచారం, క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న నేతలకు అవకాశాలు లభిస్తాయని చెప్పేందుకే భాజపా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకుల అభిప్రాయం.

ఓం బిర్లా

By

Published : Jun 19, 2019, 7:14 AM IST

Updated : Jun 19, 2019, 8:12 AM IST

17వ లోక్​సభ స్పీకర్​గా రాజస్థాన్ కోటా-బూందీ​ ఎంపీ ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ అధికార భాజపా అనూహ్య నిర్ణయం తీసుకుంది. సాధారణంగా స్పీకర్​ పదవి సీనియర్​ నేతలను వరిస్తుంది. కేవలం రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికైన బిర్లా ఎంపికలో పార్టీ అంతర్గత వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కష్టపడి పని చేసే నేతలకే అవకాశాలు వస్తాయని భాజపా కుండబద్దలు కొట్టిందంటున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్​ షాకు సన్నిహితుడు కావడం ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా బిర్లా పేరును మోదీనే సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

విద్యార్థి దశ నుంచీ...

విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించారు బిర్లా. రాజస్థాన్​ అసెంబ్లీకి 2003, 2008, 2013లో వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. 2014లో రాజస్థాన్​లోని కోటా-బూందీ స్థానం నుంచి మొదటిసారి లోక్​సభకు ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్​నారాయణ్​ మీనాపై 2.5 లక్షల ఓట్ల ఆధిక్యం సంపాదించారు.

క్రమం తప్పకుండా సభకు..

లోక్​సభకు బిర్లా క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. గత ఐదేళ్లలో ఆయన హాజరు 86 శాతంగా ఉంది. ఈ కాలంలో 671 ప్రశ్నలు సంధించిన బిర్లా.. 163 చర్చా వేదికల్లో పాల్గొన్నారు. 6 ప్రైవేట్​ బిల్లులను కూడా ప్రవేశ పెట్టారు.

కీలక నేతగా..

1991 నుంచి భారతీయ జనతా యువ మోర్చాలో 12 ఏళ్లు కీలకంగా వ్యవహరించారు బిర్లా. జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా సేవలందించారు. పార్లమెంటులో విద్యుత్​ రంగ స్టాండింగ్​ కమిటీ సభ్యునిగా, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యునిగా కూడా పనిచేశారు.

ఇదే మొదటిసారి కాదు

తక్కువ అనుభవం ఉన్నవారిని సభాపతిగా ఎంపిక చేయటం ఇదే మొదటిసారి కాదు. 1996లో తెదేపా నేత జీఎంసీ బాలయోగి కూడా స్పీకర్​గా ఎంపికయ్యే సమయానికి రెండు సార్లు మాత్రమే ఎంపీగా గెలిచారు. 2002లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో బాలయోగి మరణించారు. తొలిసారి ఎంపీగా గెలిచినపుడు మనోహర్ జోషీ కూడా స్పీకర్​ పదవిని అధిరోహించారు.

ఇదీ చూడండి: 17వ లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లా

Last Updated : Jun 19, 2019, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details