తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అల్లర్లపై విపక్షాల తీవ్ర నిరసన- ఉభయసభలు రేపటికి వాయిదా

పార్లమెంట్ రెండో విడత​ బడ్జెట్​ సమావేశాలు రెండో రోజూ సజావుగా సాగలేదు. విపక్షాలు 'దిల్లీ అల్లర్ల' అస్త్రాన్ని ఉభయసభల్లో కొనసాగించాయి. ఈ నేపథ్యంలోనే లోక్​సభ, రాజ్యసభ ఉదయం నుంచి పలు మార్లు వాయిదా పడ్డాయి. లోక్​సభలో.. కాగితాలు చింపి స్పీకర్ వైపు విసిరారు విపక్ష సభ్యులు.​ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసి.. సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా. రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

LOKSABHA, RAJYASABHA ADJOURNED TILL WEDNESSDAY AMID UPROAR ON DELHI VIOLENCE
అల్లర్లపై విపక్షాల రచ్చ- ఉభయసభలు రేపటికి వాయిదా

By

Published : Mar 3, 2020, 4:41 PM IST

దిల్లీ అల్లర్ల అంశం వరసగా రెండో రోజు పార్లమెంట్​ను కుదిపేసింది. అల్లర్లపై చర్చ జరపాలన్న విపక్షాల పట్టుతో ఉభయ సభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఫలితంగా లోక్​సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి.

లోక్​సభలో ఇలా...

మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు నిరసన చేపట్టాయి. దిల్లీ అల్లర్లపై చర్చించాలని పట్టుబట్టాయి. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్​ ఓం బిర్లా కోరినప్పటికీ.. విపక్ష సభ్యుల తీరులో మార్పు కనిపించలేదు. స్పీకర్​ అనుమతిస్తే అల్లర్లపై చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి స్పష్టంచేశారు. అయినప్పటికీ విపక్షాలు శాంతించలేదు. వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్​ చేశాయి. ప్లకార్డులు ప్రదర్శించాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్​.. తొలుత సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా.. ఫలితం లేకపోవడం వల్ల దిగువ సభ 2 గంటలకు వాయిదా వేశారు.

2 గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ.. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష నేతలు మరోసారి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే కాగితాలు చింపి స్పీకర్​ స్థానం వైపు విసిరారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను రేపటికి వాయిదా వేశారు ఓం బిర్లా.

రాజ్యసభలో పరిస్థితి...

రాజ్యసభలోనూ లోక్​సభ తరహా పరిస్థితులే దర్శనమిచ్చాయి. దిల్లీ అల్లర్లకు అధికార పార్టీ నేతల విద్వేష ప్రసంగాలే కారణమని ఆరోపిస్తూ.. విపక్షాలు నిరసనకు దిగాయి. విపక్ష సభ్యులతో అధికార పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఎగువ సభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది.

తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా.. ఫలితం శూన్యం. దీనితో సభ 3 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో పరిస్థితులు కొంత మేర శాంతించాయి. అల్లర్లపై చర్చకు కేంద్రం సిద్ధమని.. సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్​చంద్​ గెహ్లోత్​ తెలిపారు. ఈ విషయాన్ని ఛైర్మన్​ వెంకయ్యతో చర్చించి ఓ తేదీని ఖరారు చేస్తామని డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​ నారాయణ్​ సింగ్​ స్పష్టం చేశారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details