దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ పూర్తయింది. 91 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన 12వందల 79మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది ఓటరుగణం.
ఉదయం 7 గంటలకంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు... లైన్లలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో అప్పటికీ క్యూలోనే ఓటర్లున్నందుకు వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది.
త్రిపురలో 81.8... జమ్మూలో 54.49 శాతం....
వెబ్‌క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పోలింగ్ శాతం త్రిపురలో అత్యధికంగా 81.8 నమోదైందని ఎన్నికల అధికారి వెల్లడించారు. పశ్చిమ్‌బంగలో పోలింగ్ జరిగిన 2 లోక్‌సభ స్థానాలకు 81 శాతం నమోదైంది. మణిపుర్లో 78.2 శాతం, నాగాలాండ్ 78, అసోం 68, ఆంధ్రప్రదేశ్ 70.67 , తెలంగాణ 61, జమ్ముకశ్మీర్‌లో 54.49 శాతంమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుది వివరాలు వస్తే.. ఓటింగ్ శాతంపై మరింత స్పష్టత రానుంది.
హెచ్చరికలు బేఖాతరు...
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్ దంతెవాడ, మహారాష్ట్ర గడ్చిరోలి.. సమస్యాత్మక ప్రాంతాలైన జమ్ము, బారాముల్లా పరిధిలోనూ ఓటర్లు బారులు తీరారు. ఇటీవల దంతెవాడలో ఎమ్మెల్యేను హత్యచేసి, ఓటింగ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించినప్పటికీ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.దంతెవాడ జిల్లా... బస్తర్‌లోని శ్యామ్‌గిరి పోలింగ్ కేంద్రంలో 77 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించింది ఈసీ.
ఘర్షణలు...
కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో, మహారాష్ట్ర గడ్చిరోలిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి మావోలు ఐఈడీలు పేల్చారు. కానీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
ఉత్తర్‌ప్రదేశ్ కైరానాలోని షామ్లి పోలింగ్ కేంద్రంలో గుర్తింపు కార్డులు లేకుండా ఓటేసేందుకు కొందరు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. అల్లరి మూకలు రాళ్ల దాడికి దిగాయి. వారిని చెదరగొట్టేందుకు బీఎస్ఎఫ్ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈవీఎంలు మొరాయింపు
కొన్ని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు సరిగా పనిచేయక.. ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎండలో వేచి ఉండలేక కొందరు ఓటర్లు.. ఓటు వేయకుండానే వెనుదిరిగారు. తమ దృష్టికొచ్చిన ప్రాంతాల్లో వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది ఎన్నికల సంఘం.