జస్టిస్ చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ నెల 19నే రాష్ట్రపతి ఆమోదముద్ర
దేశ ప్రథమ లోక్‌పాల్‌గా జస్టిస్ చంద్రఘోష్‌ను నియమిస్తూ ఈ నెల 19న రాష్ట్రపతి భవనం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నాన్ జ్యుడిషియల్ సభ్యులు వీరే...
పారా మిలటరీ దళం ‘సశస్త్ర సీమా బల్’ (ఎస్‌ఎస్‌బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్‌తోపాటు, మాజీ ఐఆర్ఎస్ అధికారి మహేంద్ర సింగ్, గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి ఇందర్‌జీత్ ప్రసాద్ గౌతమ్‌లను లోక్‌పాల్‌లో నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా నియమించింది రాష్ట్రపతి భవనం.
జ్యుడిషియల్ సభ్యులు...
జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి, జస్టిస్ అభిలాషా కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠిలు జ్యుడిషియల్ సభ్యులుగా ఎంపికయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ పేర్లను సిఫార్సు చేయగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీటికి ఆమోదం తెలిపారు. శనివారం నుంచి వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది.
సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణ
జస్టిస్ చంద్రఘోష్ 2017 మేలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ చంద్రఘోష్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు.