మిడతల దండు దాడి నుంచి పంట నష్టం వాటిల్లకుండా చాకచక్యంగా వ్యవహరించారు మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాకు చెందిన అజ్నీ గ్రామస్థులు. తమ గ్రామానికి సమీపంలోనే మిడతలు ఉన్నాయన్న అధికారుల సమాచారంతో ముందస్తు చర్యలు తీసుకుని ఈ గండం నుంచి గట్టెక్కారు. ముందుగానే డ్రోన్ల సాయంతో పంట మొక్కలపై రసాయనాలను పిచికారీ చేయడం వల్ల.. మిడతలు చేసేది లేక అదే జిల్లాలోని మౌడా గ్రామానికి పయనమైనట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ విస్తరించిన పెంచ్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్‌ను మంగళవారం చుట్టి ముట్టాయి మిడతలు. కానీ అక్కడ జంతువులు ఉన్నందున మందుల పిచికారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సౌజన్యంతో బుధవారం ఉదయం డ్రోన్ల సాయంతో అజ్నీ ప్రాంతంలోని చెట్లు, పంటలపై రసాయనాలతో పిచికారీ చేసినట్లు వ్యవసాయ శాఖ డివిజినల్ జాయింట్ డైరెక్టర్ రవి బోస్లే పేర్కొన్నారు.