రాబోయే నాలుగు వారాల్లో మిడతల దాడి పట్ల భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) హెచ్చరించింది. భారత్- పాకిస్థాన్ సరిహద్దుకు వలస వెళ్లిన మిడతలు.. రుతు పవనాల ప్రారంభంతో రాజస్థాన్‌కు తిరిగి వస్తాయని ఎఫ్ఏఓ తాజా నివేదికలో పేర్కొంది. రాజస్థాన్‌కు వచ్చిన అనంతరం అప్పటికే ఇరాన్, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఇతర మిడతలతో కలిసి సమూహాలుగా దాడి చేయనున్నట్లు వివరించింది.
ఇతర దేశాల్లోనూ..
మిడతల దాడి వల్ల రాజస్థాన్ ఎక్కువగా ప్రభావితం కానుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు మిడతల దాడి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఎఫ్ఏఓ స్పష్టం చేసింది. భారత్‌తో పాటు పాక్, సూడాన్, ఇథియోఫియా, సోమాలియా వంటి దేశాలు ఈ రాకాసి పురుగుల వల్ల భారీ పంట నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.