మరోసారి పాక్ మిడతల దండయాత్ర- రైతులు హడల్ పాకిస్థాన్ నుంచి వేలాది సంఖ్యలో వచ్చిన మిడతలు రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోని పంటను సర్వ నాశనం చేస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి జోధ్‌పుర్ జిల్లాలోని లుని గ్రామంలోని జీలకర్ర పంటపై ప్రతాపం చూపాయి. మిడతల దండయాత్రతో గ్రామస్థులంతా హడలెత్తిపోయారు.
డోలు వాయింపు
మిడతల నుంచి పంటను కాపాడుకునేందుకు తమకు తోచిన పద్ధతిని అనుసరించారు రైతులు. వ్యవసాయ క్షేత్రాల్లో టైర్లకు నిప్పంటించారు. డోలు వాయించారు. ఇతర సామగ్రితో పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.
"పంట సాగు చేయటానికి మందులు, ఇతర సామగ్రితో కలిపి మాకు రూ. 5లక్షలు ఖర్చయింది. సోమవారం రాత్రి నుంచి ఈ మిడతల ధాటికి పంట నాశనమైంది. కనీసం రూ.50వేలు పంట కూడా చేతికి రాదు. ప్రభుత్వం దీనిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మిడతలను నియంత్రించేందుకు మందులను పంపిణీ చేయాలని కోరాం. కానీ ప్రభుత్వం మమల్ని పట్టించుకోలేదు. బజారులో దొరికే నాశిరాకం మందులను మాకు పంపిణీ చేసింది. దీనిని ఉపయోగించినప్పటికీ ఒక్క మిడత కూడా చావలేదు."
-బాధిత రైతు.
మిడతల దాడిపై సమాచారం అందుకున్న జోధ్‌పుర్ కలెక్టర్... వ్యవసాయ అధికారులతో కలిసి లుని గ్రామానికి వచ్చారు. పరిస్థితిని పరిశీలించారు. ఈ రాక్షస మిడతల వల్ల నాశనమైన పంటకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : పాకిస్థాన్ రాక్షస మిడతలతో గుజరాత్ రైతులు హడల్