"కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం".... కరోనాతో పోరు గురించి ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట ఇది. అనేక నెలలుగా ఈ యుద్ధం సాగుతూనే ఉంది. విజయం ఎప్పటికో తెలియకపోయినా.... మొక్కవోని విశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగుతోంది యావత్ భారతావని. అయితే... కనిపించే శత్రువు రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. దేశదేశాలను దాటి వచ్చిన మిడతల దండు... ఒక్కో రాష్ట్రంపై పంజా విసురుతోంది.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ మిడతలు పంటపొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్లల్లోకీ ఈ మిడతలు చేరుతున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.
ఇదీ చదవండి: మిడతల 'దండు'యాత్ర- 5 రాష్ట్రాలకు ముప్పు
మరోవైపు ఈ సమస్యకు పరిష్కారం చూపలేమంటూ పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వ్యవసాయ శాఖ వద్దే సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెబుతున్నారు. మిడతల నివారణకు రసాయనాలు అధికంగా చల్లడం వల్ల పంట నాశనమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకూ...
ఉత్తర భారత దేశంలో ప్రవేశించిన ఈ మహమ్మారి మిడతలు దక్షిణాదికీ విస్తరిస్తున్నాయి. కేరళలోని పలు ప్రాంతాల్లోనూ ఈ మిడతల దండు దాడి చేస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాలకూ ఈ మిడతల బెడద తప్పట్లేదు. వాయు వేగంతో తెలంగాణకు ఈ మిడతలు చేరుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ సడలిస్తున్న ఈ సమయంలో రైతులకు ఇదో శరాఘాతంగా మారుతుందని అంటున్నారు.
ఒకే నెలలో రెండు విపత్తులు
జూన్, జులై నెలల్లో దేశంలో కరోనా ఉద్ధృతి కట్టలు తెంచుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జులైలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని చెబుతున్నారు. మూడు నుంచి ఆరు లక్షల కేసులతో సుమారు 12-18 వేల మంది మరణించే అవకాశం ఉందని లెక్కగడుతున్నారు.
ఇదీ చదవండి: భారత్లో కరోనా ఉగ్ర రూపం అప్పుడే!