ఓ చిన్న గది.. అందులో 60 ఆవులు.. ఎవరు బంధించారో.. ఎందుకు బంధించారో తెలియదు.. ఎప్పటి నుంచి ఆ మూగజీవులు ఇరుకు గదిలో మగ్గిపోతున్నాయో కూడా సరైన సమాధానం లేదు. శనివారం ఉదయం ఆ భవనం నుంచి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుండటంతో స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది.
ఒక చిన్న గదిలో 43 ఆవులు మృతిచెంది పడి ఉన్నాయి. మరో రెండు చికిత్స చేసే సమయంలో ప్రాణాలు వదిలాయి. మరో 15 మాత్రం ప్రాణాలతో మిగిలాయి. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లా మేద్పర్ గ్రామానికి చెందిన పాత పంచాయతీ భవనంలో చోటుచేసుకుంది. ఫిర్యాదు అందుకున్న జిల్లా అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. బిలాస్‌పుర్ అదనపు కలెక్టర్ నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటయ్యింది. ఆవుల మృతికి ఊపిరి ఆడకపోవటమే కారణమని శవ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.