దేశవ్యాప్త లాక్డౌన్ వలస కార్మికుల బతుకులను ఈడ్చిరోడ్డున పడేసింది. జేబులో చిల్లిగవ్వ లేక, పట్టణాల్లో ఉండలేక సొంతగూటికి చేరేందుకు మధ్యప్రదేశ్లోని ఓ కార్మికుడు మండుటెండలో, ఎడ్ల బండిని తానే భుజాలపై మోశాడు.
మధ్యప్రదేశ్ మావ్ ప్రాంతానికి చెందిన రాహుల్కు రెండు ఎద్దులుండేవి. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన రాహుల్.. కుటుంబాన్ని పోషించేందుకు ఓ ఎద్దును అమ్మేశాడు. దౌర్భాగ్యం ఏమిటంటే... రూ.15 వేలు పెట్టి కొన్న ఎద్దును దయనీయ పరిస్థితుల కారణంగా రూ.5 వేలకే అమ్ముకోవాల్సివచ్చింది.
లాక్డౌన్ ఎత్తేస్తే తిరిగి పనుల్లోకి వెళ్లొచ్చని చాలా రోజుల నుంచి వేచిచూస్తున్నాడు రాహుల్. కానీ, లాక్డౌన్ పొడిగిస్తూనే ఉంది ప్రభుత్వం. దీంతో, గత్యంతరం లేక ఎడ్ల బండిపై ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకన్నాడు. ఒక ఎద్దుతో జోడెడ్ల బండి నడవదు.. అందుకే కుటుంబాన్ని బండిలో కూర్చోబెట్టి, మరో ఎద్దు స్థానంలో రాహుల్ బండి భారాన్ని మోశాడు.
కుటుంబ బండిని మోస్తున్న రాహుల్.. ఇండోర్ బైపాస్ మీద తారసపడిన ఈ హృదయ విదారక దృశ్యం.. వలస కార్మికుల కన్నీటి వెతలకు అద్దం పడుతోంది.
ఇదీ చదవండి:లాక్డౌన్లో ఇలా చేస్తే తలనొప్పి దూరం!