దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉండటం వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది. దీనికి అనుగుణంగా కొందరు నిబంధనలకు లోబడి లాక్‌డౌన్ పాటిస్తున్నారు. కానీ మరికొందరు ఆకతాయిలు మాత్రం నిబంధనలు ఉల్లఘించి పోలీసులకు తలనొప్పిగా మారారు.
లాక్‌డౌన్ నింబంధనలు ఉల్లఘించే వారి ఆటకట్టించేందుకు కేరళ పోలీసులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. డ్రోన్ కెమెరాలతో వారిపై నిఘాను పెట్టారు. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ మరి కొన్ని చోట్ల మాత్రం ప్రజలు గుమిగూడటం ఉండటం కనిపించింది. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు పోలీసులు.
పరుగో పరుగు..
డ్రోన్ కెమెరాలను చూసిన వెంటనే ప్రజలు చెల్లాచెదురుగా పరిగెత్తారు. అలా వేర్వేరు ప్రాంతాల్లో రికార్డు చేసిన వీడియోలన్నింటిని కలిపి వాటికి 2016లో పాపులర్ అయిన రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, ఇయాన్ బోథమ్‌ల ట్రేసర్ బుల్లెట్ ఛాలెంజ్ కామెంటరీ ఆడియోను జోడించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
ముందు వెనక లేదు!
వీడియోలో డ్రోన్ కెమెరా కంట పడకుండా ఉండేందుకు ప్రజలు పొలాలు, బీచ్‌ల గుండా వేగంగా పరిగెత్తారు. కొంతమంది టవల్, లుంగీలతో తమ ముఖాన్ని కప్పుకునేందుకు ప్రయత్నించారు. మరికొందరు చెట్టుచాటున దాక్కున్నారు. ఈ చర్యలు నవ్వులు పూయించాయి. ఈ వీడియోని కేరళ పోలీసులు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన కొద్ది సేపట్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. దాదాపు రెండు లక్షలమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 4 వేలమంది షేర్ చేశారు.
ఇదీ చూడండి:కన్నబిడ్డను తాకలేక తల్లడిల్లిన తల్లి!