లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసర సరకులు అందేలా కృషి చేస్తున్న చిన్న వ్యాపారులు, దుకాణాదారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
చిన్న వ్యాపారులకు, దుకాణదారులకు ధన్యవాదాలు: మోదీ "ఈ చిన్న వ్యాపారులు, దుకాణాదారులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టకపోతే... నిత్యావసర సరకులు పంపిణీ చేయకపోతే ఏం జరిగేదో కాస్త ఆలోచించండి?"
- ప్రధాని మోదీ ట్వీట్
సదా స్మరణీయం
మొత్తం సామాజిక వ్యవస్థను నిర్వహించడంలో చిన్న వ్యాపారులు గణనీయమైన పాత్ర పోషించారని ప్రధాని మోదీ కొనియాడారు. వీరి సహకారాన్ని భారత సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. అయితే దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.
సంక్షోభాన్ని ఎదుర్కోవాలి..
దేశాన్ని కరోనా సంక్షోభం చుట్టుముట్టిన వేళ... స్వయంగా భౌతిక దూరం పాటించడం, ఇతరుల చేత అలా చేయించడం ఎంతటి సవాల్‌తో కూడుకున్నదో తాను గ్రహించానని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు లాక్డౌన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:'వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టుక'