వాయు కాలుష్యం.. ప్రపంచ దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న భారత్‌కూ ఓ పెద్ద సమస్య. ముఖ్యంగా దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో వాయు నాణ్యత పడిపోయి.. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం అంతంత మాత్రమే. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
కరోనాను కట్టడి చేసే లక్ష్యంతో కేంద్రం 21 రోజుల లాక్డౌన్ విధించింది. దాదాపు 130కోట్ల మంది ప్రజలను ఇళ్లకే పరిమితమవ్వాలని స్పష్టం చేసింది. ఫలితంగా వానహ రాకపోకలు నిలిచి, పరిశ్రమలు మూతపడి.. కాలుష్య శాతం తగ్గిపోతోంది. వాయు నాణ్యత మెరుగుపడుతోంది. దిల్లీతో పాటు 90 నగరాల్లో కనిష్ఠ స్థాయిలో కాలుష్యం నమోదవుతోంది. ఈ విషయం కేంద్రం నేతృత్వంలోని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెథర్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్(ఎస్ఏఎఫ్ఏఆర్) అధ్యయనంలో తేలింది.
కాలుష్యపు కోరల్లో చిక్కుకుని ప్రమాదపు అంచున ఉన్న దిల్లీలో వాయు కాలుష్యం ఏకంగా 30శాతం తగ్గిందని పేర్కొంది. అహ్మదాబాద్, పుణెలో 15శాతం మేర వాయు కాలుష్యం తగ్గినట్లు వెల్లడించింది.