తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదలపై లాక్​డౌన్​ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే అంతే! - కరోనా తాజా వార్తలు

కరోనా కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్​ కూడా తీవ్రమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా లాక్​డౌన్​ ప్రభావం పేదలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. దారిద్ర్యం, అనారోగ్యం మధ్య వారు నలిగిపోకుండా ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.

lockdown effect on poverty people... if do not be aware to have to face Aftermath+
పేదలపై లాక్​డౌన్​ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే అంతే!

By

Published : Apr 5, 2020, 6:44 AM IST

కరోనా ప్రభావం సామాజిక, ఆర్థిక పరిస్థితులపై తీవ్రంగా ఉంటుందని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ‘లాన్సెట్‌’ అభిప్రాయపడింది. '‘ఈ మహమ్మారి కారణంగా అకస్మాత్తుగా ఆదాయాలు కోల్పోయి, సామాజిక మద్దతు అందుకోలేని వారి పరిస్థితి భవిష్యత్తులో దుర్బలంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు తలెత్తే గడ్డు పరిస్థితి ఉంటుంది' అని హెచ్చరించింది. ప్రధానంగా పేదలు అటు దారిద్య్రం, ఇటు అనారోగ్యం మధ్య నలిగిపోకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలని పేర్కొంది.

అసంఘటిత రంగం నలిగిపోతుంది

భారత్‌ లాంటి దేశాల్లో 80 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. అందులో మూడోవంతు రోజువారీ కూలీలే. ఇలాంటి పెళుసైన సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ వంటి చర్యలు ఆరోగ్య అసమానతలకు దారితీస్తాయి. ప్రజలు పేదరికం, అనారోగ్యం మధ్య నలిగిపోకుండా చూడాలంటే ప్రస్తుత పరిణామాలను చాలా జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది. హ్యూమన్‌రైట్స్‌ వాచ్‌ నివేదిక ప్రకారం భారత్‌లో అమలుచేస్తున్న లాక్‌డౌన్‌తో అట్టడుగు వర్గాల ప్రజలు జీవనోపాధితో పాటు ఆహారం, ఆవాసం, ఆరోగ్యం, ఇతర అత్యవసరాలకు దూరమవుతున్నారు. గతంలో ఎన్నడూచూడని ఇలాంటి సవాలును ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు దీర్ఘాలోచనతో చర్యలు తీసుకోవాలి.

అక్కడ అంత సులువు కాదు

కరోనా వ్యాప్తి నివారణకు వ్యక్తిగత దూరం, తరచూ చేతుల శుభ్రత పాటించాలన్న వ్యూహాలు అమలు చేస్తున్నారు. జనసాంద్రత అధికంగా ఉండే సమూహాల్లో వీటి అమలు అంత సులభం కాదు. పూరిళ్లు, పరిశుభ్రత లేమి, రక్షిత మంచినీరు లేనిచోట నివసించే ప్రజలు పౌష్టికాహారలోపం, అసంక్రమిత వ్యాధులు, ఎయిడ్స్‌, క్షయ లాంటి రోగాలతో సతమతమవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారికి కొవిడ్‌-19 ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది.

పిల్లల భవితకూ శాపమే

కొవిడ్‌-19 పిల్లల భవిష్యత్తుపైనా పెను ప్రభావం చూపుతోంది. మార్చి 23 నాటి యునిసెఫ్‌ నివేదిక ప్రకారం లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దీవుల్లో 154 మిలియన్ల చిన్నారులు విద్యకు దూరమవుతున్నారు. ఈ నష్టం కేవలం చదువుకే పరిమితం కాలేదు. చాలా రంగాలపై దీర్ఘకాల ప్రభావం ఉంటుంది. 2015 నాటి ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఎబోలా వైరస్‌ ఆఫ్రికా సామాజిక, ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపింది. యుక్త వయసు బాలికల్లో గైనిక్‌ సమస్యలు ఎక్కువయ్యాయి. బడి మానేసే పిల్లల సంఖ్య, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి.

గుర్తించకుంటే విధ్వంసం..

కొవిడ్‌-19 సమయంలో విధాన రూపకర్తలు ప్రజల మధ్య ఆరోగ్య అసమానతలు పెరగకుండా జాగ్రత్త పడాలి. దుర్బల స్థితిలో ఉన్న ప్రజలను గుర్తించకపోతే ఈ మహమ్మారి ద్వారా తలెత్తే పరిణామాలు విధ్వంసకరంగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు అనుసరించినప్పటికీ అందరికీ ఒకేతరహా విధానం పనికిరాదు. ప్రతి దేశం స్థానికంగా ఉన్న పరిస్థితులను గమనించి అత్యధిక ముప్పును ఎదుర్కొంటున్న వర్గాలకు ఎక్కువ మద్దతిచ్చేలా వ్యవహరించాలని లాన్సెట్‌ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details