తెలంగాణ

telangana

లాక్​డౌన్​లో పొగాకు, మద్యం సేవిస్తే ఇక అంతే!

By

Published : Mar 31, 2020, 2:10 PM IST

కరోనా వ్యాప్తిని నివారించాలంటే ప్రజలు లాక్ డౌన్ అవసరాన్ని గుర్తించాలని కేంద్ర ఆరోగ్య స్పష్టం చేసింది. ఇంట్లోనే ఉంటూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మద్యం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని.. అసత్య ప్రచారాలను నమ్మవద్దని విన్నవించింది.

HEALTH-LOCKDOWN
కరోనా

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశమంతా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ఫలితంగా కోట్లాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. 24 గంటలు ఇంట్లోనే గడుపుతుండటం వల్ల చాలా మంది విసుగు చెందుతున్నారు. ఈ పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

ఏమీ పనిలేకుండా ఇంట్లో ఉన్నారనే కారణంతో మద్యం, పొగాకు ఉత్పత్తులను తీసుకోవద్దని సూచించింది ఆరోగ్య శాఖ. ధూమపానం, మద్యపానం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గటం సహా మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుందని హెచ్చరించింది.

"ఎవరికైనా ఈ అలవాట్లు ఉండి ఒత్తిడి లోనైతే వెంటనే నిపుణులను సంప్రదించండి. కరోనా కాలంలో మన ఆలోచనలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది."

- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అవసరమైతేనే బయటకు..

వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్ డౌన్ అవసరాన్ని ప్రజలు గుర్తించాలని ఆరోగ్య శాఖ కోరింది. అత్యవసరమైతే తప్ప కాలు బయట పెట్టకూడదని సూచించింది. నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లాలని చెప్పింది. వైరస్​ సోకిన వారి పట్ల వివక్ష చూపొద్దని, నిందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

"మీకు తెలిసినవారు ఎవరైనా ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటే వారికి సరైన జాగ్రత్తలు చెప్పండి. అవసరమైతే వైద్య సహాయం ఎలా పొందాలో తెలియజెప్పండి. "

-కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

వీటితో కాలక్షేపం..

ఎవరైనా కరోనా బారిన పడినా భయపడవద్దని సూచించింది ఆరోగ్య శాఖ. స్వీయ నిర్బంధం, సరైన వైద్యం అందితే వ్యాధి తగ్గుతుందని స్పష్టం చేసింది. ఇంట్లో ఉన్న సమయంలో ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒక పనిలో నిమగ్నం కావాలని తెలిపింది. సంగీతం వినటం, పుస్తకాలు చదవటం, సినిమాలు, టీవీ కార్యక్రమాలు వీక్షించటం, వ్యాయామం వంటివి మంచి కాలక్షేపాన్ని ఇస్తాయని చెప్పింది.

అసత్య ప్రచారాలు నమ్మొద్దు..

ఈ సూచనలు పాటిస్తూనే కరోనాపై అసత్య ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. స్వీయ నిర్బంధానికి అత్యంత విశ్వసనీయమైన సమాచార వనరులనే ఆశ్రయించాలని సూచించింది. ఏదైనా సమాచారాన్ని నిజమో కాదో తెలియకుండా షేర్ చేయొద్దని హితవు పలికింది.

"జ్ఞానాన్ని సంపాదించుకోవటం మంచిదే. మీరు వైరస్ గురించి ఎంత తెలుసుకుంటే అంతగా భయం పోతుంది. ఈ క్రమంలో సంచలన వార్తలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చేవాటిని నమ్మితే మీరు మానసికంగా బలహీనమవుతారు.

వైరస్ ఎంతమందికి వ్యాపించింది? ఎంతమంది చనిపోయారు? అనే విషయాలను అస్తమానం చర్చించకండి. దానికి బదులుగా ఎంతమంది కోలుకున్నారో తెలుసుకోండి. చేతులు శభ్రం చేసుకోవటం, ఇతరులకు దూరం ఉండటం వంటివి పాటించండి. "

- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

మీ ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తెలిపింది. సాధారణంగా వచ్చే జలుబు కరోనా వైరస్ లక్షణం కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో దగ్గటం, తుమ్మటం, ఉమ్మటం మానుకోవాలని చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇదీ చూడండి:ఆపరేషన్​ నిజాముద్దీన్​: వారంతా ఎక్కడికి వెళ్లారు?

ABOUT THE AUTHOR

...view details