సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) రానున్న విద్యా సంవత్సరానికి 9, 10, 11, 12 తరగతుల సిలబస్‌ను హేతుబద్ధీకరించే విషయాన్ని పరిశీలిస్తోంది. కరోనా విజృంభణ, లాక్డౌన్ కారణంగా విలువైన సమయం వృథా కావడమే ఇందుకు కారణం.
ఎన్‌సీఈఆర్‌టీ బాటలో...
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) 1 నుంచి 8 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను గత వారం ప్రకటించింది. మిగతా తరగతులకూ ప్రత్యామ్నాయ క్యాలెండర్ రూపొందించే పనిలో ఉంది ఎన్‌సీఈఆర్‌టీ. ఇప్పుడు ఇదే బాటలో కేంద్రీయ విద్యాశాఖ పయనిస్తోంది.
అన్నీ వాయిదా...
దేశంలో కరోనా భయాలు అలముకున్న నేపథ్యంలో... మార్చి 5న లాక్డౌన్ ప్రకటించడానికి వారం రోజుల ముందే అన్ని పాఠశాలలు మూతపడ్డాయి. సీబీఎస్ఈతో పాటు అనేక రాష్ట్ర బోర్డుల పరిధిలోని పరీక్షలు వాయిదా పడడమో, రద్దు కావడమో జరిగింది. తరువాత ఈ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నా..
లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో... అనేక పాఠశాలలు ఆన్లైన్లో బోధన, అభ్యాస కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అయితే వీటికి ఏకరూప మార్గదర్శకాలు ఏమీ లేకపోవడం గమనార్హం.