కరోనా వైరస్ భారత్‌లో రోజురోజుకీ ఉద్ధృతం రూపం దాలుస్తోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 3.3లక్షలు దాటేశాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చెలరేగిన ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసిన విషయం తెలిసిందే. మరోవైపు, దిల్లీ సీఎం కేజ్రీవాల్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీలు కూడా తమ రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచనలో లేమంటూ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళనాడు ప్రభుత్వం కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా? లేదా? అనే గందరగోళం ప్రజల్లో నెలకొంది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరోనా కట్టడిపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశంపై దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో 'లోకల్ సర్కిల్స్' అనే ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో మాత్రం జనం మళ్లీ లాక్‌డౌన్‌కే జైకొట్టారు. దేశంలోని 221 జిల్లాల నుంచి మొత్తం 46వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశంలో రోజుకు సుమారు 11 వేల కేసులు వస్తున్న నేపథ్యంలో అధిక వైరస్ ప్రభావం ఉన్న 15 జిల్లాల్లో నెల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించడం అవసరమని భావిస్తున్నారా? అని ఈ సర్వేలో అడిగిన ప్రశ్నకు 74శాతం మంది లాక్‌డౌన్ పెట్టాల్సిందేనని అభిప్రాయం వ్యక్తంచేయగా.. 22శాతం మంది అవసరం లేదని.. మిగతా 4శాతం మంది చెప్పలేం అని పేర్కొన్నారు.