గతేడాది డిసెంబర్లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టించింది. తొలుత చైనా, దక్షిణ కొరియాలను భయపెట్టి.. ఆపై ఐరోపా దేశాలను చుట్టుముట్టింది. ఇప్పుడు అమెరికా దేశాలను అతలాకుతలం చేస్తోంది. జనజీవనం అస్తవ్యస్తమై... బతుకు చక్రాలకు బ్రేకులు పడ్డాయి. కార్యకలాపాల్లేక ఆదాయానికి గండిపడింది. ఆర్థిక వ్యవస్థలే పతనమయ్యాయి.
భారత్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్నా.. ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యమిస్తూ 40 రోజుల సుదీర్ఘ లాక్డౌన్ను అమలు చేసింది. కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ మోదీ సర్కార్... వైరస్ వ్యాప్తిని మితిమీరకుండా చేస్తూ వస్తోంది. అయినా.. కేసులు, మరణాలు తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి లాక్డౌన్ను పొడిగించింది. అయితే.. ఈ సారి ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే.. కరోనాను తరిమికొట్టేందుకు పూనుకున్న కేంద్రం మార్గదర్శకాల్లో సడలింపులు ఇచ్చింది.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా వైరస్ తీవ్రతను బట్టి జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది కేంద్రం.
- కేసులు లేని లేదా 21 రోజులుగా కొత్త కేసులు నమోదుకాని జిల్లాలను గ్రీన్జోన్లుగా పిలుస్తారు.
- కరోనా తీవ్రత, రెట్టింపు రేటు, నివారణ చర్యల ఆధారంగా..
- రెడ్ జోన్లు లేదా హాట్స్పాట్ జిల్లాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది.
- రెడ్, గ్రీన్ జోన్లుగా కాకుండా ఉన్నవాటిని ఆరెంజ్ జోన్లుగా పరిగణిస్తారు.