అధికరణ 370 రద్దు నేపథ్యంలో.. నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతల విడుదల తమ చేతుల్లో లేదని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్ స్థానిక ప్రభుత్వమే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో.. కశ్మీర్‌లో గృహ నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలను ఎప్పుడు విడుదల చేస్తారని అధీర్ ప్రశ్నించగా.. అమిత్ షా ఇలా సమాధానమిచ్చారు.
''ఏ ఒక్క నేతనూ అవసరమైన సమయం కంటే ఒక్కరోజు ఎక్కువగా జైల్లో ఉంచరు. స్థానిక ప్రభుత్వం సరైనదిగా భావించిన సమయంలో వారు విడుదలవుతారు. ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాను కాంగ్రెస్ 11 సంవత్సరాలు జైల్లో ఉంచింది. మేం వారిని అనుసరించాలనుకోవట్లేదు. తగిన సమయంలో వారే(స్థానిక అధికారులు) విడుదల చేస్తారు. ఈ అంశంలో మేం జోక్యం చేసుకోం.''
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి