కరోనా మహమ్మారి నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అక్టోబర్-నవంబర్లో నిర్వహించకూడదని కోరుతూ.. భాజపా మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే.. ఉద్దేశపూర్వకంగా ప్రజలను మృత్యువు వైపు తీసుకెళ్లడమే అవుతుందని ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనాను అరికట్టడం, వరద సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉందన్న ఎల్జేపీ.. అక్టోబర్-నవంబర్ నాటికి వైరస్ ఇంకా తీవ్రంగా ఉంటుందన్న నిపుణుల మాటలు గుర్తు చేసింది. అందరి ప్రాధాన్యం.. ప్రజల ప్రాణాలను కాపాడటమే తప్ప ఎన్నికలు నిర్వహించడం కాదని లేఖలో వివరించింది.