తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: 'మహా'లో రాష్ట్రపతి పాలన.. కోవింద్​ ఆమోదముద్ర - congress leaders to meet sharad pawar in mumbai

లైవ్​: మహా ప్రతిష్టంభనపై కాంగ్రెస్​ సందిగ్ధత

By

Published : Nov 12, 2019, 1:07 PM IST

Updated : Nov 12, 2019, 5:59 PM IST

17:42 November 12

మహా'లో రాష్ట్రపతి పాలన.. కోవింద్​ ఆమోదముద్ర

మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగిన రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు విఫలమైనందున రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన గవర్నర్​ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోద ముద్ర వేశారు. కోవింద్​ సంతకంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అంతకుముందు గవర్నర్​ సిఫార్సును కేంద్ర కేబినెట్​ కూడా ఆమోదించింది.  

  • మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
  • గవర్నర్‌ సిఫార్సు, కేంద్ర తీర్మానానికి ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
  • రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని నివేదిక పంపిన గవర్నర్‌
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ మరింత సమయం కోరడంతో మారిన పరిణామాలు
  • అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన రాష్ట్రపతి

17:16 November 12

మరో పిటిషన్​ వేస్తాం: శివసేన

ఒకవేళ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే... ఆ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ మరో పిటిషన్​ దాఖలు చేస్తామని తెలిపింది శివసేన. 

17:08 November 12

గవర్నర్​ రాజ్యాంగ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు: కాంగ్రెస్​

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్​ తప్పుబట్టింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ.. రాజ్యాంగ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. 

గవర్నర్​ నిర్ణయాన్ని ఖండించారు మహారాష్ట్ర కాంగ్రెస్​ ప్రతినిధి సచిన్​ సావంత్​. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఎంపికలను పరిశీలించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. గవర్నర్​ ఎవరి ఒత్తిడితోనే పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. 

16:54 November 12

ముంబయికి కాంగ్రెస్​ సీనియర్లు.. పవార్​తో భేటీ

కాంగ్రెస్​ పార్టీ సీనియర్లు మల్లికార్జున్​ ఖర్గే, అహ్మద్​ పటేల్​, కేసీ వేణుగోపాల్​ ముంబయికి చేరుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాలపై ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​తో చర్చలు జరపనున్నారు. 

16:50 November 12

'మహా'లో కొత్త ట్విస్ట్​.. రాష్ట్రపతి పాలన విధింపు..!

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్​ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకై ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్​ సిఫార్సు చేశారు. కేంద్ర కేబినెట్​ కూడా ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదముద్ర వేయడమే తరువాయి. అయితే.. గవర్నర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ శివసేన... సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యమవుతున్నందున గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. రాష్ట్రపతికి నివేదిక అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పార్టీలు విఫలమైనందున కేంద్ర కేబినెట్​ కూడా.. గవర్నర్​ సిఫార్సును ఆమోదించింది. 

అయితే... గవర్నర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది శివసేన. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టుకునేందుకు అదనపు గడువు కోరితే గవర్నర్​ ఇవ్వనందుకు సేన.. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గవర్నర్​ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించిన సేన.. ఈ పిటిషన్​పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. శివసేన తరఫున కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​ వాదించనున్నారు. 

శివసేనకు కాంగ్రెస్​ షాక్​..

గవర్నర్‌ ఇచ్చిన గడువులోగా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని, సరిపడా సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టడానికి 3 రోజుల గడువు ఇవ్వాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని శివసేన అభ్యర్థించింది. ఇందుకు ఆయన నిరాకరించారు. 
ఆ తర్వాత కాసేపటికే మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీపీని ఆహ్వానించారు. ఆ పార్టీకీ ఇవాళ రాత్రి 8.30 గంటల వరకు గడువు విధించారు. ఆ డెడ్​లైన్​ముగియకముందే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించగా.. ఆ పార్టీ తాము అందుకు సిద్ధంగా లేమని గవర్నర్​కు తెలిపింది. 

కాంగ్రెస్​ చర్చిస్తుండగానే....

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్​, ఎన్సీపీ మధ్య చర్చలు జరుగుతుండగానే... కేంద్రం రాష్ట్రపతి పాలనకు అంగీకారం తెలపడం గమనార్హం.

ముంబయిలో ఎన్సీపీతో చర్చలు జరిపే బాధ్యతలను.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముగ్గురు సీనియర్లకు అప్పగించారు. అహ్మద్​ పటేల్​, మల్లికార్జున్​ ఖర్గే, కేసీ వేణుగోపాల్​లు.. పవార్​తో భేటీ కానున్నారు. అనంతరం.. ఈ రెండు పార్టీల మద్దతు వైఖరిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. అంతకుముందు సోనియా కూడా పవార్​తో ఫోన్​లో సంభాషించారు. ఇవాళ ఉదయం తన నివాసంలో కాంగ్రెస్​ కోర్​కమిటీ సభ్యులతోనూ ఈ అంశంపై చర్చించారు. ఈ పరిణామాల నడుమ శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్​ల మద్దతు కోసం ఎదురుచూస్తోంది. 

15:32 November 12

రాజ్​భవన్​ ప్రకటన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సంబంధించి రాజ్​భవన్​ అధికారిక ప్రకటన చేసింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు నివేదిక సమర్పించినట్లు వెల్లడించింది. 

రాష్ట్రపతి పాలన విధించాలన్న సిఫార్సుకు కేంద్రమంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు కోవింద్​ ఆమోదముద్ర వేయడమే తరువాయి.
 

15:16 November 12

సుప్రీంకోర్టుకు శివసేన

  • సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర రాజకీయం
  • సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన శివసేన
  • ఇతర పార్టీల మద్దతు లేఖలు ఇచ్చేందుకు 3 రోజుల గడువును గవర్నర్ తిరస్కరించడాన్ని సవాలు చేసిన శివసేన
  • మద్దతుదారుల సంఖ్యాబలం లేఖను సమర్పించేందుకు 3 రోజుల గడువు గవర్నర్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేసిన శివసేన

14:39 November 12

క్యాబినెట్​ భేటీలో కీలక నిర్ణయం!

  • ముగిసిన కేంద్ర క్యాబినెట్ భేటీ..
  • మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
  • ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపనున్నట్లు సమాచారం
  • కేంద్ర క్యాబినెట్ భేటీకి కొద్దిసేపటి ముందుగా రాష్ట్రపతి పాలన సూచిస్తూ మహారాష్ట్ర గవర్నర్ లేఖ పంపినట్లు పేర్కొన్న ప్రధాని కార్యాలయ వర్గాలు

14:22 November 12

రాష్ట్రపతి పాలన ఖాయం!

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిష్టంభన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు గవర్నర్ భగత్​సింగ్​ కోషియారీ​ సిఫార్సు చేసినట్టు సమాచారం.

14:15 November 12

రాష్ట్రపతి పాలన తప్పదా!

రాష్ట్రపతి పాలనవైపు మహారాష్ట్ర ప్రతిష్టంభన అడుగులు వేస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందన్న వార్తలూ జోరందుకున్నాయి. రాష్ట్రపతి పాలనకే గవర్నర్​ మొగ్గుచూపితే.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఉద్ధవ్​ ఠాక్రే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నాయవాది, కాంగ్రెస్​ నేత కపిల్​ సిబాల్​తో శివసేన అధ్యక్షుడు చర్చలు జరిపారు.

12:53 November 12

మహా'లో రాష్ట్రపతి పాలన.. కోవింద్​ ఆమోదముద్ర

మహా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించడం సహా శివసేనతో పొత్తు విషయంపై చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అహ్మద్​ పటేల్, కే.సీ. వేణుగోపాల్​​ ముంబయికి బయలుదేరారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​తో కాంగ్రెస్ నేతలు విస్తృత చర్చలు జరపనున్నారు. ఈ విషయమై శరద్ పవార్​తో సోనియా చర్చించారు. 

ప్రభుత్వ ఏర్పాటుపై ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్సీపీతో కలిసి ఉమ్మడిగానే తీసుకుంటామని కాంగ్రెస్ నేత ఖర్గే స్పష్టం చేశారు.

'ఎన్నికలకు ముందే కాంగ్రెస్, ఎన్​సీపీ మధ్య పొత్తు ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది ఉమ్మడిగానే తీసుకుంటాం. ఎన్​సీపీతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు ముగిసిన తర్వతే ఇతర విషయాల్లో ముందుకు సాగుతాం.'-మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత.

నాటకీయ పరిణామాలు

అంతకుముందు మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబయికి రావాల్సిన మల్లికార్జున ఖర్గే, కే.సీ వేణుగోపాల్​లు తమ పర్యటన రద్దు చేసుకున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మానిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. తొలుత రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామన్న ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలతో పర్యటన వాయిదా వేసినట్లు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత ఖర్గే బృందం... రాష్ట్ర నేతలతో చర్చించడానికి ముంబయి బయలుదేరింది. 

సంజయ్​ రౌత్​ను కలిసిన నేతలు

ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో శివసేన నేత సంజయ్​ రౌత్​ను వేరువేరుగా కలిశారు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్. అస్వస్థత కారణంగా ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన సంజయ్​తో రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. సోమవారం నాడు తీవ్ర ఛాతి నొప్పి కారణంతో సంజయ్​ ఆస్పత్రిలో చేరారు. 

సంజయ్ ఆసక్తికర ట్వీట్​

ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన సైతం విఫలమైన నేపథ్యంలో ప్రముఖ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన పద్యాన్ని ఉటంకిస్తూ ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.  

'తరంగాలకు భయపడే పడవ తీరాన్ని చేరుకోలేదు. ధైర్యం చేసేవారు ఎప్పుడూ ఓడిపోరు' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. మేం తప్పకుండా విజయం సాధిస్తామని మరో ట్వీట్​లో పేర్కొన్నారు సంజయ్.

Last Updated : Nov 12, 2019, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details