కరోనా నియంత్రణకు అన్ని దేశాలతో కలిసి పోరాడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అందరితో కలిసి పురోగతి సాధించాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 7 కోట్ల మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములుగా చేసినట్లు తెలిపారు.
"ఈ ఏడాది మనం ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మానవ పురోగతిలో ఐరాస పాత్రను గుర్తించాలి. ప్రస్తుతం ప్రపంచంలోని 193 దేశాలను ఐరాస ఒక దగ్గరికి చేర్చింది. దేశీయ ప్రయత్నాల ద్వారా 2030 అజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మేము మళ్లీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి కూడా మేం మద్దతు ఇస్తున్నాం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో మేం ముందుకు వెళ్తున్నాం. "
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని