తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా మజా' ముగిసిన చర్చలు.. 3న మంత్రివర్గ విస్తరణ - NCP CONGRESS

MLA'S OF MAHARASTRA TO TAKE OATH TODAY
మరికాసేపట్లో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

By

Published : Nov 27, 2019, 7:42 AM IST

Updated : Nov 27, 2019, 11:25 PM IST

23:23 November 27

  • దిల్లీ వెళ్లిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే
  • రేపటి ఉద్ధవ్‌ ప్రమాణస్వీకారానికి రావాలని మోదీని ఆహ్వానించిన ఆదిత్య ఠాక్రే

23:01 November 27

కాంగ్రెస్‌కే సభాపతి..

మహారాష్ట్ర వికాస్‌ కూటమి కీలక భేటీ ముగిసింది. ముంబయిలోని వైభవం సెంటర్‌లో నిర్వహించిన ఈ భేటీకి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు హాజరై వివిధ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే బాలాసాహెబ్‌ థోరట్‌ మాట్లాడుతూ సీఎంతో సహా మూడు పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. మంత్రి పదవుల పంపకంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.

కాంగ్రెస్‌కు సభాపతి పదవి, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి, ఉపసభాపతి పదవులు కేటాయిస్తారని తెలిపారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను శివసేన నేతలు ఆహ్వానించారు. సీఎం అభ్యర్థి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే దిల్లీ వెళ్లి వారిని స్వయంగా ఆహ్వానించారు.

22:48 November 27

  • దిల్లీ వెళ్లిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు,శివసేన నేత ఆదిత్య ఠాక్రే
  • రేపటి ఉద్ధవ్‌ ప్రమాణస్వీకారానికి సోనియాను ఆహ్వానించిన ఆదిత్య ఠాక్రే
  • ప్రమాణస్వీకారానికి రావాలని మన్మోహన్‌సింగ్‌ను ఆహ్వానించిన ఆదిత్య ఠాక్రే

22:11 November 27

  • డిసెంబరు3న మంత్రివర్గ విస్తరణ:ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌
  • ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి పదవి ఉంటుంది:ప్రఫుల్ పటేల్‌
  • కాంగ్రెస్‌కు సభాపతి,ఎన్సీపీకి ఉపసభాపతి పదవులు:ప్రఫుల్ పటేల్‌

17:35 November 27

  • మహారాష్ట్రలో 3 పార్టీల మధ్య కొలిక్కివచ్చిన మంత్రి పదవుల పంపకం
  • 16-15-13 ఫార్ములాకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ అంగీకారం
  • సభాపతి పదవిపై పట్టుబట్టరాదని నిర్ణయించుకున్న కాంగ్రెస్‌
  • పదవుల పంపకంపై పవార్‌తో అహ్మద్‌ పటేల్‌, మల్లికార్జున ఖర్గే చర్చలు
  • ఉద్ధవ్‌ ప్రమాణస్వీకారానికి సోనియాగాంధీని ఆహ్వానించిన శివసేన
  • మహారాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది రైతులను ఆహ్వానించిన శివసేన
  • రేపు సాయంత్రం 6.40 గం.కు ముంబయి శివాజీపార్కులో ఉద్ధవ్‌ ప్రమాణస్వీకారం
  • శాసనసభాపక్షనేత బాధ్యతలు మళ్లీ అజిత్‌కు అప్పగించే యోచనలో ఎన్సీపీ
  • ఉద్ధవ్‌ మంత్రివర్గంలోఉపముఖ్యమంత్రి బాధ్యతలను అజిత్‌ చేపడతారని సంకేతాలు
     

14:04 November 27

స్పీకర్​ ఎన్నిక ఎప్పుడు?

స్పీకర్​ను నేడు ఎన్నుకోవాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఉద్ధవ్​ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. రాష్ట్రంలో నూతన కేబినెట్​ ఏర్పడిన అనంతరం స్పీకర్​ పదవిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే.. ఈ పదవికి కాంగ్రెస్​ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 30నే స్పీకర్​ ఎన్నిక జరుగుతుందనీ ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

14:01 November 27

ముగిసిన ప్రమాణం

మహారాష్ట్రలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార వేడుక ముగిసింది. మొత్తం 288 ఎమ్మెల్యేలల్లో 286 మంది ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. పలు కారణాల వల్ల ఇద్దరు మంత్రులు హాజరు కాలేకపోయారు. ప్రొటెం స్పీకర్​ భగవత్​ నిన్ననే ప్రమాణం చేశారు.

12:28 November 27

పదవుల పంపకంపై చర్చ షురూ

  • మహారాష్ట్రలో పదవుల పంపకంపై కాంగ్రెస్‌లో చర్చ
  • ఉపముఖ్యమంత్రి పదవికి బదులుగా స్పీకర్‌ పదవి కోరే ఆలోచనలో కాంగ్రెస్‌
  • ముంబయి వెళ్తున్న సుశీల్‌ కుమార్‌ షిండే, అహ్మద్‌ పటేల్‌, కె.సి.వేణుగోపాల్‌

11:55 November 27

ఎంతో గర్వంగా ఉంది: ఆదిత్య ఠాక్రే

ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణస్వీకారం చేయడం ఎంతో గర్వంగా ఉందని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. రాష్ట్రాభివృద్ధికి అందరు కట్టుబడి ఉంటారని ఠాక్రే స్పష్టం చేశారు.

10:56 November 27

'మహా'సభలోకి మారిన సీన్: 'శాసనసభ్యుడినైన నేను...'

నిన్నటివరకు హోటళ్లు, పార్టీ కార్యాలయాలు కేంద్రంగా జరిగిన మహారాష్ట్ర రాజకీయం నేడు శాసనసభకు చేరుకుంది. కొత్తగా ఎన్నికైన వారితో శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబ్కర్. తొలుత... ఎమ్మెల్యేలు బాబన్​రావ్ పచ్పుటే, విజయ్​కుమార్ గవిట్, రాధాకృష్ణ విఖే పాటిల్​ను ప్రిసైడింగ్ అధికారులుగా ప్రకటించారు ప్రొటెం స్పీకర్.

అనంతరం దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఎన్​సీపీకి చెందిన అజిత్ పవార్, దిలీప్ వాల్సే పాటిల్, ఛగన్ భుజ్​బల్, కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, పృథ్వీరాజ్, భాజపా నేత హరిభావ్ భగాడే ప్రమాణ చేశారు.

'అన్నచెల్లెలి అనుబంధం'

మహారాష్ట్ర శాసససభ ప్రత్యేక సమావేశం సందర్భంగా ఎన్నికైన శాసనసభ్యులను ఆహ్వానిస్తూ ప్రవేశద్వారం వద్ద నిల్చున్నారు ఎన్​సీపీ నేత, శరద్​ పవార్ కుమార్తె సుప్రియా సూలె. ఇంతలో శాసనసభలోకి వెళ్లేందుకు అక్కడికి చేరుకున్నారు అజిత్ పవార్. తిరుబాటు యత్నం విఫలమై పవార్​తో రాజీ పడిన సోదరుడు అజిత్​ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు సుప్రియ.

అనంతరం అక్కడికి వచ్చిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​తోనూ కరచాలనం చేశారు సూలె. కాసేపు ఆయనతో ముచ్చటించారు.

'పార్టీతోనే నా ప్రయాణం'

తన రాజకీయ ప్రస్థానం ఎన్​సీపీతోనే అని స్పష్టం చేశారు అజిత్​ పవార్.

"ప్రస్తుతం నేను చెప్పేదేమీ లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నేను ఇంతకుముందే చెప్పాను. నేను ఎన్​సీపీలోనే ఉన్నాను. ఉంటాను కూడా. ఇందులో గందరగోళం సృష్టించేందుకు ఏమీ లేదు."

-అజిత్​ పవార్, ఎన్​సీపీ నేత

యువ ఠాక్రేకు శుభాకాంక్షల వెల్లువ

తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రేకు సీనియర్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభకు చేరుకున్న ఆదిత్యకు ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు సుప్రియా సూలె. శాసనసభలో యువఠాక్రేను అభినందిస్తూ శివసేన, ఎన్​సీపీకి చెందిన నేతలు చుట్టుముట్టారు.

ముఖ్యమంత్రి లేకుండానే

మహారాష్ట్ర 14వ శాసనసభ సభ్యుల ప్రమాణస్వీకారం ముఖ్యమంత్రి లేకుండానే సాగింది. గత రెండు దశాబ్దాలుగా సీఎం ముందుగా ప్రమాణస్వీకారం చేసే సంప్రదాయం ఉందని, అయితే ఈసారి ఆ పద్ధతి పాటించలేకపోయామని అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ చెప్పారు.

గవర్నర్​తో ఉద్ధవ్ భేటీ..

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సతీ సమేతంగా గవర్నర్ భగత్​సింగ్ కోశ్యారీని కలిశారు. ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

10:55 November 27

రెండు రోజుల్లో 'మహా' పదవుల పంపకాలు!

ఉత్కంఠభరిత మలుపుల అనంతరం మహా ప్రతిష్టంభనకు తెరపడింది. ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మిగిలింది పదవుల పంపకాలు మాత్రమే.

శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ కూటమిలో ఉపముఖ్యమంత్రి సహా ఇతర పదవుల పంపకాలపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆధ్యక్షుడు బాలాసాహెబ్​ థోరట్​ వెల్లడించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రమాణ స్వీకారానికి రాహుల్​!

ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణస్వీకార మహోత్సవానికి కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ హాజరవుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనిపై స్పందించిన థోరట్​... వేడుకలో రాహుల్​ పాల్గొనడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
 

10:16 November 27

పదవుల పంపకాలు ఎప్పుడు?

మహా ప్రతిష్టంభన ముగిసింది. ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక మిగిలింది పదవుల పంపకాలు మాత్రమే. అయితే పోర్ట్​ఫోలియోల పంపకాలపై సందిగ్ధత నెలకొందని కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్​ థోరట్​ తెలిపారు. కొన్ని రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని వెల్లడించారు.

10:07 November 27

పార్టీలోనే ఉంటా: అజిత్​ పవార్​

ఎన్​సీపీతో బంధంపై అజిత్​ పవార్​ స్పష్టతనిచ్చారు. పార్టీలోనే ఉండి ప్రజాసేవ చేస్తానని వెల్లడించారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదన్నారు.

మహారాష్ట్ర 'ట్విస్ట్'​లో కీలక పాత్ర పోషించారు అజిత్​ పవార్​. ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు మద్దతిచ్చి సంచలనం సృష్టించారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఫలితంగా ఎన్​సీపీ శాసనసభాపక్ష నేత పదవిని కోల్పోయారు.

09:37 November 27

ఉపముఖ్యమంత్రి ఎవరు?

తీవ్ర నాటకీయ పరిణామాల అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ ఠాక్రే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఉపముఖ్యమంత్రిగా ఎవరుంటారనే అంశంపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదని కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్​ థోరట్​ వ్యాఖ్యానించారు.

09:18 November 27

గవర్నర్​తో ఉద్ధవ్​ ఠాక్రే భేటీ

మహారాష్ట్ర గవర్నర్​తో శివసేన అధ్యక్షుడు, మహా వికాస్​ అఘాడీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉద్ధవ్​ ఠాక్రే సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు ఠాక్రే.

09:08 November 27

ఎంతో అరుదు...

ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో మహారాష్ట్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు జరగకుండా, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయకుండా ఎమ్మెల్యేలు ప్రమాణం చేయడం దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి అని రాష్ట్ర విధానసభ కార్యదర్శి రాజేంద్ర భగవత్​ తెలిపారు. 

08:38 November 27

అజిత్​ పవార్​- సుప్రియా సూలే ఆప్యాయ ఆలింగనం

ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో నూతన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ వద్ద అజిత్​ పవార్​- సుప్రియా సూలే ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు.

08:22 November 27

మరాఠావాసులు మాతోనే: సూలే

జాతీయవాద కాంగ్రెస్ పార్టీ(ఎన్​సీపీ) నేత సుప్రియా సూలే శాసనసభ వద్ద సందడి చేశారు. అతిపెద్ద బాధ్యతలు ప్రజలు మా చేతుల్లో పెట్టారన్నారు. మహారాష్ట్రలోని ప్రతి పౌరుడు తమకు బాసటగా నిలిచారని ఉద్ఘాటించారు. అంతకుముందు శాసనసభకు చేరుకున్న మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​తో సరదాగా ముచ్చటించారు సూలే.

08:18 November 27

'మహా' ప్రమాణస్వీకారం ప్రారంభం

మహారాష్ట్ర శాసనసభ్యుల ప్రమాణస్వీకారం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబ్కర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణం చేస్తున్నారు.

08:02 November 27

ఆదిత్యుడి ప్రత్యేక పూజలు

శివసేన నవతరం నేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరికాసేపట్లో ప్రమాణస్వీకారాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ శాసనసభకు చేరుకున్నారు.

07:45 November 27

ఇదీ జరిగింది...

288 స్థానాలున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్​ 24న విడుదలయ్యాయి. అనంతరం.. 15 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. నవంబర్​ 12న అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన.. 23 వరకు కొనసాగింది. ఫలితంగా... శాసనసభ్యుల ప్రమాణ స్వీకారమూ ఆలస్యమైంది.

07:15 November 27

మరికాసేపట్లో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

ఉత్కంఠగా సాగిన రాజకీయ పరిణామాల అనంతరం.. మరికాసేపట్లో మహారాష్ట్ర శాసనసభ సమావేశం కానుంది. ఉదయం 8 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ ఆదేశించారు. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్​గా నియమితులైన కాళిదాస్​ కొలంబ్కర్​... కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Last Updated : Nov 27, 2019, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details