బాంబు నిర్వీర్యం- అనుమానితుడి కోసం వేట షురూ కర్ణాటకలోని మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించిన బాంబును ఖాళీ ప్రదేశంలో బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. విమానాశ్రయంలోని టికెట్ కౌంటర్ల వద్ద ఉన్న ఓ ల్యాప్టాప్ బ్యాగ్లో ఈ ఐఈడీని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.
టోపీ పెట్టుకుని విమానాశ్రయంలోకి అనుమానాస్పదంగా ప్రవేశించిన ఓ వ్యక్తిని గుర్తించినట్టు.. మంగళూరు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అనుమానితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను రంగంలోకి దింపామని వెల్లడించారు.
"కేంద్ర పరిశ్రమల భద్రతా బలగాల ఫిర్యాదు మేరకు బట్వే పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకుని కేసును ఛేదించడానికి ఇప్పటికే మూడు బృందాలను ఏర్పాటు చేశాం. బృందాలు ప్రాథమిక ఆధారాలను సేకరించగలిగాయి. అనుమానితుడిని మధ్యవయస్కుడిగా గుర్తించాం. అతడు టోపీ పెట్టుకుని ఫార్మల్ దుస్తుల్లో ఉన్నాడు. రిక్షాలో వచ్చి విమానశ్రయంలోకి ప్రవేశించినట్టు తెలుసుకున్నాం. ఈ ప్రాథమిక ఆధారలను పరిగణనలోకి తీసుకుని.. అనుమానితుడిని గుర్తించడానికి కొన్ని వీడియోలను విడుదల చేశాం. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అయినందును.. ఆగంతుకుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే వెంటనే మాకు తెలపాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా."
- పీఎస్ హర్ష, మంగళూరు పోలీస్ కమిషనర్.
ఇదీ జరిగింది...
సోమవారం మధ్యాహ్నం మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. బాంబు ఉందన్న అనుమానంతో కేంద్ర పరిశ్రమల భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. బ్యాగులో బాంబును గుర్తించారు అధికారులు. అక్కడున్న ప్రజలందరినీ ఖాళీ చేయించి.. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాగును వేరే ప్రాంతానికి తరలించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని సూచించారు.