little girl becomes astronaut to repair road...! కర్ణాటక మంగళూరు నగరంలో ఓ చిన్నారి వ్యోమగామిగా మారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. స్పేస్ సూట్ వేసుకొని సెంట్రల్ మార్కెట్ వద్ద మెల్లగా గతుకులున్న రోడ్లపై నడుస్తూ కనిపించింది. తమ ప్రాంతంలో రోడ్లను బాగు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఇలా వినూత్నంగా నిరసన తెలిపింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే...
నగరంలో రోడ్లన్నీ గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయని.. వాటిని బాగు చెయ్యాలని స్థానికులు, ఎమ్సీసీ సివిక్ గ్రూపు కలిసి మునిసిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎలాంటి ఫలితమూ లేకపోయింది. దీంతో అర్జున్ మస్కరెన్హాస్, అజోయ్ దిసెల్వా అనే ఇద్దరు వ్యక్తులు వినూత్నమైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
ఆరోతరగతి చదువుతున్న అడ్లిన్ దిసెల్వా అనే చిన్నారిని వ్యోమగామిగా మార్చి గుంతలున్న రోడ్లపై నడుస్తున్నట్లు చిత్రీకరించారు.
కొద్ది రోజుల క్రితం ప్రముఖ త్రీడీ కళాకారుడు బాదల్ నంజుదాస్వామి ఇదే తరహాలో బెంగళూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంటనే అధికారులు ఆ రహదారిని మరమ్మతులు చేయించారు.