రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న వేళ మళ్లీ రిసార్టు రాజకీయాలు ఊపందుకున్నాయి. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టులకు తరలిస్తున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో 'సత్యంవైపు నిలవండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అంటూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు.
'ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెడు సంప్రదాయాలవైపు మొగ్గొద్దు. ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజల మనోభావాలను, ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కోసం ఎలా పనిచేస్తోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు సత్యం వైపే నిలుస్తారన్న నమ్మకం ఉంది. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి సహకరిస్తారని నమ్ముతున్నా'
- అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి.
కరోనా విపత్తు వేళ అందరూ వైరస్‌పై పోరాడాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు గహ్లోత్. ఇలాంటి సమయంలో కొందరు సహచరులు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఈనెల 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే బలపరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు గహ్లోత్.
గుజరాత్‌కు భాజపా ఎమ్మెల్యేలు..
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు రోజుల్లో 18 మంది భాజపా ఎమ్మెల్యేలు రాజస్థాన్ నుంచి గుజరాత్‌కు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను వేధిస్తోందని.. అందుకే మానసిక ప్రశాంతత కోసం సోమనాథ్‌కు వెళ్లినట్లు భాజపా ఎమ్మెల్యే నిర్మల్ కుమావత్ తెలిపారు.
గుజరాత్‌కు చేరుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలు అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లారు. వారు ఎక్కడికి వెళ్లారనేది ఇంకా తెలియరాలేదు.