దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు 21 రోజుల లాక్‌డౌన్ విధించిన అనంతరం తొలిసారి దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. జనతా కర్ఫ్యూతో భారతీయులు తమ శక్తిసామర్థ్యాలు చాటారని కొనియాడారు. ప్రజలంతా ఏకమై భారత్లో కరోనాను తరిమికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని. లాక్‌డౌన్ పాటించడంలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్న ఆయన.. ప్రస్తుతం అన్ని దేశాలు మన బాటలోనే నడుస్తున్నాయని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనని పునరుద్ఘాటించారు.
"ఈ ఆదివారం రాత్రి లైట్లన్నీ ఆపేసి కేవలం కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలి. సరిగ్గా 9 గంటలకు మొదలుపెట్టి 9 నిమిషాలపాటు దీన్ని కొనసాగించాలి. దేశ ప్రజలంతా కరోనాను తరిమికొట్టేందుకు ఈ విధంగా సంకల్పించుకోవాలి. సంకట సమయంలో ఇది భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మన సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో ఏదీ ఉండదు. రండి... సంకల్పంతో కరోనాను ఎదిరించండి.