బిహార్‌లో దళితుల నాయకుడిగా పేరుగాంచిన దివంగత నేత రామ్ విలాస్ పాసవాన్.. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యస్థాపకుడైన పాసవాన్.. "శతాబ్దాల చీకటి నిండుకున్న ఇంట్లో దీపం వెలిగిస్తాను" అనే నినాదంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
బిహార్ పోలీసు ఉద్యోగాన్ని వదిలి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు పాసవాన్. ఇప్పటివరకు ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ కేబినెట్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
5 దశాబ్దాలు..
1946 జులై 5న బిహార్‌లోని ఖగారియా జిల్లా షాహర్‌బన్నీలో ఓ దళిత కుటుంబంలో జన్మించిన పాసవాన్.. కోసి కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతరం పట్నా వర్సిటీలో పీజీ చేశారు. 1969లో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పాసవాన్.. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లోనే కొనసాగారు.
ప్రపంచ రికార్డు మెజారిటీ..
మాజీ ప్రధానులు వీపీ సింగ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ హాయాంలో మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వంలోనూ మంత్రిగా సేవలందించారు. 1974లో లోక్‌దళ్ స్థాపించాక ఆ పార్టీలో చేరారు. 1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకు వెళ్లి వచ్చిన ఆయన 1977లోఅత్యధిక మెజార్టీతో గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించారు. అనంతరం 2000లో లోక్‌జన్‌శక్తి పార్టీని స్థాపించారు. అనంతరం 1969లో తొలిసారి సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.