కరోనా వైరస్‌పై పోరాటానికి భారతదేశం తనదైన పద్ధతులు ఎంచుకోవాలని ‘సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ (సీడీడీఈపీ) వ్యవస్థాపక డైరెక్టర్, అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం ఆచార్యులు రమణన్ లక్ష్మీనారాయణ్ అభిప్రాయపడ్డారు. "అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న అవకాశాలు మనకు లేవు. మనది చైనాలాగా కమ్యూనిస్టు దేశం కాదు, అమెరికాలాగా ధనిక దేశమూ కాదు. పైగా భారత్‌లో ఎక్కువమంది రోజువారీ వేతనాలతో జీవితం నెట్టుకొచ్చేవారే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతర దేశాలకు పూర్తిగా భిన్నమైన పద్ధతులు అనుసరించాలి, భారతీయ పరిష్కారాలు కనుగొనాలి" అని ఆయన సూచించారు. వచ్చే రెండువారాల పాటు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించడం, ఏమాత్రం జలుబు, జ్వరం లక్షణాలున్నా చికిత్స తీసుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ ఉపద్రవం ఇప్పటికిప్పుడే తొలగిపోయేది కాదని, దీనిపై కొంతకాలం పాటు యుద్ధం చేయాల్సిందేనని అన్నారు. భారతీయ వైద్యరంగం దీనికి అవసరమైన శక్తియుక్తులను ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సమకూర్చుకుంటుందని విశ్లేషించారు. ఈ ప్రాణాంతక వైరస్‌ను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని, అయితే ప్రజల పూర్తిస్థాయి భాగస్వామ్యం లేకపోతే దీనిపై విజయం సాధించలేమని పేర్కొన్నారు. కరోనా వైరస్ సవాలు, భారత్‌కు ఉన్న ముప్పు తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ ఎం.ఎల్.నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూ...
ప్రశ్న: కొవిడ్ విషయంలో ఇప్పటికీ లక్షల మంది భారతీయులు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీని మూలంగా రానున్న రోజుల్లో ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది?
కరోనా వైరస్ చాలా సులభంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. కానీ భయపడనక్కరలేదు. ఇది మరింత విస్తరించకుండా తగ్గించేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా వేగంగా ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. ఒకేసారి అత్యధికంగా కేసులు వస్తే అందుకు తగ్గట్లుగా అవసరమైన సేవలు అందించే సామర్థ్యం భారతీయ ఆరోగ్య వ్యవస్థలకు లేదు. కాబట్టి దీని విస్తరణను అడ్డుకోవడమే ఇప్పుడు కీలకం. సరైన జాగ్రత్తలు తీసుకొంటే వైద్య వ్యవస్థపై పడే భారం తగ్గించగలుగుతాం.
ప్ర: వైరస్ ఇప్పటికే సమాజ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) దశలో ఉంటే తక్షణం తీసుకోవాల్సిన చర్యలేమిటి?
నాలుగు విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి. రోజుకు కనీసం అయిదుసార్లయినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయటి వస్తువు దేన్నయినా తాకితే చేయి కడుక్కోండి. దగ్గేటప్పుడు గాలిలోకి దగ్గడం లేదా చేతులను అడ్డుపెట్టుకోవడం కాకుండా మోచేతిలోకి దగ్గడం అలవాటు చేసుకోండి. దగ్గు, జ్వరం ఉన్నవాళ్లు వెంటనే స్వయంగా తమను తాము ఒక గదికి పరిమితం చేసుకోవాలి. అంటే స్వీయ నిర్బంధంతో ఇతరులకు దూరంగా ఉండాలి. నాలుగోది వచ్చే రెండు వారాలు వీలైనంతవరకు ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యేందుకు ప్రయత్నించాలి.
ప్ర: చైనాలాగా భారత్‌లోనూ పరిపూర్ణ మూసివేతను అమలుపరచడం సాధ్యమవుతుందా లేక మరో ప్రత్యామ్నాయం ఉందా?
పరిపూర్ణ మూసివేత నిజంగా సాధ్యపడినప్పుడే లాభం ఉంటుంది. ఈ దేశంలో నిరంతరం ఎన్నో పనులు సామాజికంగానే జరుగుతుంటాయి. అందులోనూ కోట్ల సంఖ్యలో ఏ రోజుకారోజు డబ్బు సంపాదిస్తేగానీ పూటగడవని కూలీలున్నారు. ఈ కొవిడ్-19ను నియంత్రించడానికి భారత్‌కు ప్రత్యేకమైన ఓ పద్ధతి ఉండాలి. అందుకోసం భారత్ ఓ నమూనాను అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కువ వైరస్ ఉన్న జిల్లాలను తీసుకొని పరీక్షలు చేయడం, అక్కడ నిర్బంధం అమలుపరచడం ప్రారంభించాలి. ప్రస్తుతానికి ఇదే చేయగలం. ఈ వైరస్ చైనాలో ఒక ప్రాంతానికే పరిమితమైంది. కానీ- భారత్‌లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది ఇప్పటికే విస్తరించింది.
ప్ర: తక్కువ ఖర్చుతో పరీక్షలు చేయడం వీలు కాదా? ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా పరీక్షలు చేయడం ఎంతవరకు సాధ్యం?
వేగంగా పరీక్షలు నిర్వహించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. కానీ అటువంటి పద్ధతులను భారత్‌లో వినియోగించడానికి ఇంకా ఆమోదం పొందలేదు. త్వరగా ఈ పని చేయాలి. అందరికీ పరీక్షలు చేయడం అనేది ఎంతో నైపుణ్యంతో కూడిన పని. దీనికి తగినంత శిక్షణ కావాలి. తక్కువ ఖర్చుతో వేగంగా వైద్య పరీక్షలు చేయగల పద్ధతులు సమీప భవిష్యత్తులో భారత్‌లోనూ అందుబాటులోకి రావచ్చు.
ప్ర: ఈ విపత్కర సమయంలో కార్పొరేట్ ఆసుపత్రుల బాధ్యత ఏమిటి? అత్యవసర కేసులను చేర్చుకొనే సమయంలో చిన్న ఆసుపత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి?
కార్పొరేట్ ఆసుపత్రులు ప్రస్తుతానికి తమ లాభాపేక్షను పక్కనపెట్టి దేశాన్ని రక్షించడంపై దృష్టి పెట్టాలి. ఈ ఆసుపత్రులన్నింటినీ ప్రత్యేకంగా కొవిడ్-19 కేసులను ఎదుర్కోవడం కోసం సిద్ధం చేయాలి. వారికున్న శక్తి సామర్థ్యాలను ఈ వైరస్‌పైన పోరాటానికి కేటాయించాలి. చిన్న ఆసుపత్రులది తీవ్రమైన అంశం. అత్యవసర కేసులు, గర్భిణీ స్త్రీలను కరోనా కేసులతో కలిపి ఒకేచోట పెట్టి ఇతరులకూ సోకే విధంగా చేయకూడదు. కొవిడ్-19 కేసులకు ప్రత్యేకంగా వైద్యం అందించేలా చూడాలి. ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎంత అన్నది ఇంకా తేలలేదు. దీనికి అవకాశం ఇవ్వకుండా చూడటమే ముఖ్యం.
ప్ర: దేశంలో కోట్లమందికి సరైన గృహ వసతి లేదు. ఎక్కువ మంది ఇరుకైన చిన్న ఇళ్లలో నివసిస్తున్నారు. ఇలాంటిచోట వైరస్ విస్తరించకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?