తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దశాబ్ది సవాల్​: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం - మలిసంధ్యకు ఊతకర్ర అవుదాం

ముదిమి మీద పడుతున్న ఆ దేహాలు నిన్నటి వెలుగులకు సజీవ సాక్ష్యాలు. సమాజ నిర్మాణానికి, సంపద సృష్టికి పునాదిరాళ్లు. పిల్లల ఎదుగుదల కోసం సర్వస్వం త్యాగం చేసిన వృద్ధతరం నేడు నిరాదరణకు గురవుతోంది. మలిసంధ్య వెలుగుల్ని వృద్ధతరం ఆస్వాదించే పరిస్థితుల్ని సృష్టించడం కొత్త దశాబ్ది ముందున్న అతిపెద్ద సవాలు. వారికి ఊతకర్రలా నిలవడం కొత్త దశాబ్దం ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఇందుకోసం ఏం చేయాలి?

Let us breathe FOR OLD PEOPLE IN THEIR LAST DAYS
మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం

By

Published : Dec 28, 2019, 6:20 AM IST

ఎందరికో చేయూత అందించిన ఆ చేయి ఇప్పుడు ఆసరా అడుగుతోంది. మమతల్ని పంచిన ఆ మనసు తిరిగి అదే ఆప్యాయతల కోసం ఎదురుచూస్తోంది. ఆ వృద్ధతరం మనసును సంతోషపెట్టడం, వారికి ఆదరాభిమానాల్ని పంచడం, అనారోగ్యం పాలైతే సరైన వైద్య చికిత్సలు అందించడం నేటి తరం ముందున్న ప్రధాన కర్తవ్యం.

సగటు ఆయుర్దాయం పెరిగి.. అంతకంతకూ పెరుగుతున్న వృద్ధ జనాభాను భారంగా భావించకుండా.. వారికి ఊతకర్రలా నిలవడం కొత్త దశాబ్దం ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఇందుకోసం ఏం చేయాలి? ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలి? సంపద సృష్టిలో వృద్ధుల సేవల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు?

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో భారతీయుల సగటు ఆయుర్దాయం 41 ఏళ్లు. ఇప్పుడది 69 ఏళ్లు. వైద్య విప్లవం, పెరిగిన జీవన ప్రమాణాలు, పోషకాహారం మనిషి ఆయుర్దాయాన్ని గణనీయంగా పెంచడం గొప్ప పురోగతే అయినా.. దీపం కింద చీకటిలాగా మరో కోణం భయపెడుతోంది. అదే వృద్ధ భారతం. వయసు మళ్లిన వారి సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. అనేకానేక దేశాల్లో ఇదే పరిస్థితి. జపాన్‌లో అత్యంత శీఘ్రగతిన వృద్ధ జనాభా పెరుగుతోంది. వృద్ధుల జనాభాలో చైనా తర్వాత ఇప్పుడు మన దేశం రెండో స్థానంలో ఉంది.
మలిసంధ్య వెలుగుల్ని వృద్ధతరం ఆస్వాదించే పరిస్థితుల్ని సృష్టించడం కొత్త దశాబ్ది ముందున్న అతిపెద్ద సవాలు.

సవాల్‌ ఎందుకు?

  • భారత్‌లో ప్రతి 10 మందిలో ఒకరు వృద్ధాప్యంలో ఉన్నారు. 2050 నాటికి దేశంలో వృద్ధ జనాభా 40 కోట్లు మించిపోతుందని అంచనా.
  • దేశంలోని వృద్ధుల్లో సుమారు 70 లక్షల మంది ఇంటికే పరిమితం అవుతున్నారు. అనారోగ్యంతో దాదాపు మరో 25 లక్షల మంది మంచం పడుతున్నారు. వీరికి సపర్యలు చేసే క్రమంలో పనిచేసే సామర్థ్యమున్న పలువురు ఉత్పత్తి రంగానికి దూరమవుతున్నారు.
  • వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కూలీల జీవనం 60 ఏళ్ల తర్వాత కష్టమవుతోంది. వీరి పోషణను పేద కుటుంబాలు భారంగా భావిస్తున్నాయి.
  • ఉద్యోగ విరమణ తర్వాత పురుషులు మరో 17 ఏళ్లు, స్త్రీలు 21 ఏళ్లు జీవించడానికి అవకాశముందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. పింఛను పథకాలు సరిగ్గా లేకపోవడంతో వీరిలో చాలామంది శరీరం సహకరించకున్నా మళ్లీ ఉద్యోగాలు చేస్తున్నారు.
  • ఆర్థిక సమస్యలున్న వృద్ధులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇది కుంగుబాటు, మానసిక, శారీరక అనారోగ్యానికి దారితీస్తోంది.
  • వలస వెళుతున్న కుటుంబాలు వీరిని ఒంటరిగా వదిలేస్తున్నాయి. లేదా వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నాయి.

మనమేం చేయాలి?

మనమేం చేయాలి?
  • ఒంటరితనం వృద్ధాప్యానికి పెనుశాపం. పిల్లల అనాదరణ కారణంగా చాలా మంది వృద్ధులు కుంగుబాటుకు గురవుతుంటారు. దీనికి పరిష్కారం- తరచూ వారిని కలుస్తుండడం, ఫోన్‌లో పలకరిస్తుండడం, మేం అండగా ఉన్నామన్న భరోసా కల్పించడం. పిల్లలతో అనుబంధాన్ని పెంచడం ముఖ్యం.
  • జీవితంపై ఉత్సుకత పెంచేలా కొత్త దుస్తులు, అలంకరణ వస్తువులు వారికి అందుబాటులో ఉంచుతూ.. వారి శరీరంపై వారికి ఇష్టం పెరిగేలా ఉత్సాహపరచాలి.
  • తమ వయసు వారితో ఆలోచనలు పంచుకోవడానికి వృద్ధులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి సంఘజీవనం ఉన్న చోటికి, లేదా పార్కుల్లో ఆ వయసువారు పోగయ్యే చోటికి వృద్ధుల్ని తరచూ తీసుకువెళుతూ ఉండాలి.
  • సంగీతం, నాట్యం, చర్చాగోష్ఠులు, ఆటలు, సాహిత్యం ఇలా వివిధ కళల్లో అభినివేశమున్న వారిని ఒకేచోటకు చేర్చడానికి చొరవ తీసుకోవాలి.
  • సాంకేతికతను పెద్దలకు మరింత చేరువ చేయాలి. వారికి సెల్‌ఫోన్‌, బ్యాంకులు, ఇతర బిల్లులు చెల్లించే యాప్‌లపై అవగాహన కల్పించాలి.
  • ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నామన్న భావన కలగకుండా వారికి తరచూ వైద్య పరీక్షలు చేయిస్తుండాలి. ప్రభుత్వాలు ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పి, ఉచిత వైద్య సేవలు అందించాలి.
  • కొన్ని వైద్య పరికరాల్ని ఇంట్లోనే అందుబాటులో ఉంచాలి. వృద్ధులకు సౌకర్యంగా ఇళ్లల్లో మార్పులు చేయాలి.
  • బయటికి గట్టిగా చదివే వృద్ధులు మతిమరుపు(అల్జీమర్స్‌) బారిన పడటంలేదని ఇటీవలి వైద్య సర్వేలు చెబుతున్నాయి. ఈ మేరకు వారి సేవలను పాఠశాలల్లో ఉపయోగించుకోవచ్చు.
  • పనిచేసే సామర్థ్యం ఉన్న వృద్ధులకు ఏ రంగంపై మక్కువ ఉంటే.. ఆ దిశగా పని కల్పించి.. తద్వారా సంపద సృష్టించొచ్చు. మన దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో ఇప్పటికీ వృద్ధులు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. జర్మనీ, జపాన్‌లలో పనిచేసే వృద్ధ జనాభా ఎక్కువ. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. వారు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్నీ కల్పించొచ్చు.

జపాన్‌ అడుగులో అడుగేద్దాం..

జపాన్‌ అడుగులో అడుగేద్దాం..
  • జపాన్‌లోని 3.5 కోట్ల మంది వృద్ధుల్లో 90 ఏళ్లకు పైబడిన వారు 20 లక్షలు, శతాధికులు 70 వేల మంది. 2030 నాటికి ప్రతి ముగ్గురిలో ఒకరు 65 అంతకంటే ఎక్కువ వయసున్న వారే ఉంటారు. రానున్న 20 ఏళ్లలో జపాన్‌ జీడీపీ 1% తగ్గుతుంది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఆ దేశం వేస్తున్న అడుగులు ప్రపంచానికి ఆదర్శం.
  • చక్కటి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రజలకు అలవాటు చేశారు. కొవ్వును పెంచే జంతు మాంసానికి బదులు పండ్లు, కూరగాయలు, చేపలు, సముద్రపు నాచు, సోయా ఉత్పత్తులను తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా హృద్రోగాలతో మరణించే వారి సంఖ్య 36% తగ్గింది.
  • వృద్ధుల వైద్య ఖర్చుల్లో అత్యధికం ప్రభుత్వమే భరిస్తుంది. పింఛన్‌ పథకాలు అదనం.
  • భోజన, వ్యాయామశాలలు, పార్కుల్లో వయోధికులకు సాయపడేందుకు ప్రత్యేక రోబోలను తయారు చేశారు.
  • వృద్ధులు ఎప్పుడూ ఏదో ఒకపని చేస్తూనే ఉంటారు. వచ్చిన ఆదాయాన్ని వినోదాలు, ప్రయాణాలు, ఆహారంపై అధికంగా ఖర్చుచేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
  • జపాన్‌లో వృద్ధులను జాతి సంపదగా భావిస్తారు. ఇల్లు, పని ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు, రవాణా వాహనాలు... ఇలా అన్నిచోట్లా వారికే ప్రాధాన్యమిస్తారు. ఏటా సెప్టెంబరు 3వ సోమవారాన్ని ‘పెద్దలను గౌరవించే దినోత్సవం’గా నిర్వహిస్తారు.
    ఎక్కడ ఎందరు వృద్ధులు

భారత్‌లో వృద్ధుల కోసం..

భారత్‌లో వృద్ధుల కోసం..

కేంద్రంలో- ప్రధానమంత్రి వయో వందన యోజన, ఆయుష్మాన్‌ భారత్‌

ఆంధ్రప్రదేశ్‌లో- రూ.2250 పింఛన్‌, ఆరోగ్యశ్రీ

తెలంగాణలో- రూ.2016 పింఛన్‌, ఆరోగ్యశ్రీ

చైనా ఆదర్శం

చైనా ఆదర్శం

చైనాలో వృద్ధులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 4 వేల ఆసుపత్రులను 20 వేల వైద్య సంస్థలతో అనుసంధానం చేశారు. వీటిలో వృద్ధుల సమస్యలు-పరిష్కారాలపై నిరంతరం పరిశోధన సాగుతోంది. వృద్ధులకు సాయపడేందుకు 3 లక్షల మంది సుశిక్షిత నర్సులున్నారు. వీరి సంఖ్యను 2022 నాటికి 20 లక్షలకు పెంచాలనేది లక్ష్యం.

ABOUT THE AUTHOR

...view details