జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కదలికల నిర్మూలన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా దక్షిణ కశ్మీర్ పాంపోర్ ప్రాంతంలో లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కి అనుబంధంగా పనిచేస్తోన్న ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.
" పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతంలో ఎల్ఈటీకి చెందిన క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతను ఎల్ఈటీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం సహా ఇతర సహాయం అందిస్తున్నాడు. జిల్లాలోని పాంపోర్, ఖ్రేవ్, కాకాపోరా ప్రాంతాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తరలింపులో పాలుపంచుకుంటున్నాడు."
- సీనియర్ పోలీసు అధికారి
అరెస్ట్ అయిన వ్యక్తి పాంపోర్‌లోని జాఫ్రోన్ కాలనీకి చెందిన హరిస్ షరీఫ్ రాథర్‌గా గుర్తించారు. అతని నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ చర్యల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ ఏడాది శ్రీనగర్-జమ్ము రహదారిలో భద్రతా దళాలపై జరిగిన నాలుగు దాడుల్లో పాలుపంచుకున్న పాకిస్థానీ ఉగ్రవాది సైఫుల్లా సన్నిహితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్న మరుసటి రోజునే ఈ అరెస్ట్ చేపట్టడం మరో ముందడుగు. అరెస్టైన వారి నుంచి దాడులకు ఉపయోగించిన కార్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో పాక్ ఆయుధాలు.. ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్