ప్రతిపక్షాలు తనపై చేస్తున్న విమర్శలకు పార్లమెంట్‌లోనే సమాధానం చెప్తానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పేర్కొన్నారు. రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేయడాన్ని సమర్థించుకున్నారు. దేశ నిర్మాణం కోసం శాసన విభాగం, న్యాయ శాఖ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.
"దేశ నిర్మాణం కోసం ఏదో ఒక సమయంలో శాసన విభాగం, న్యాయ విభాగం కలిసి పనిచేయాలన్న బలమైన ఉద్దేశంతోనే రాజ్యసభ నామినేషన్‌ను నేను అంగీకరించాను. న్యాయవ్యవస్థ అభిప్రాయాలను పంచుకోవడానికి పార్లమెంట్లో ఇదో అవకాశంలా ఉంటుంది. చెప్పాల్సింది చాలా ఉంది. పార్లమెంట్లో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను."
-రంజన్ గొగొయి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
విపక్షాల అభ్యంతరం
రాజ్యసభకు గొగొయిని నామినేట్ చేయడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంపై ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థ స్వతంత్రతను నీరుగారుస్తుందని వ్యాఖ్యానించింది.
కేంద్ర నిర్ణయం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందని సీపీఎం ఆరోపించింది. ఎన్సీపీ సైతం కేంద్రం తీరును తప్పుబట్టింది. గొగొయ్‌ను నామినేట్ చేయాల్సింది కాదని అభిప్రాయపడింది. సున్నితమైన కేసులను విచారించిన న్యాయమూర్తులను రాజ్యసభకు నియమించకుండా ఉండాలని పేర్కొంది.
'పదవీ విరమణ తర్వాత జడ్జిలను ఇతర పదవుల్లో నియమించడం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు మచ్చలాంటిది ' అని 2019లో గొగొయి చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గుర్తు చేశారు.
మాజీ న్యాయమూర్తులు ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలే కాకుండా పలువురు మాజీ న్యాయమూర్తులు సైతం విభేదించారు. మాజీ సీజేఐ నియామకం తనను ఆశ్చర్యపర్చలేదని, అయితే నామినేషన్ ఇంత త్వరగా రావడమే ఆశ్చర్యకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిష్పాక్షికత, సమగ్రతను ప్రశ్నిస్తోందని అన్నారు.
రాజ్యసభ నామినేషన్‌పై మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ తీవ్రంగా స్పందించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిస్పాక్షికతకున్న గొప్ప విలువలతో జస్టిస్ రంజన్ గొగొయి రాజీ పడ్డారని పేర్కొన్నారు. అత్యున్నత ధర్మాసనం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తనతో పాటు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ గొగొయిలు కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను గుర్తు చేశారు.
"రాజ్యసభ సభ్యుడిగా గొగొయిని నామినేట్ చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతపై సాధారణ ప్రజలకున్న విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది. న్యాయవ్యవస్థను కాపాడేందుకు ధైర్యమైన నిర్ణయం(ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశిస్తూ) తీసుకున్న ఆయన ఇప్పుడు గొప్ప విలువతో రాజీ పడ్డారు."
-జస్టిస్ కురియన్ జోసెఫ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
కీలక తీర్పులపై విచారణ
జస్టిస్ రంజన్ గొగొయి 2018-19 మధ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా 13 నెలలు బాధ్యతలు నిర్వర్తించారు. అయోధ్య భూవివాదం, శబరిమలలోకి మహిళల ప్రవేశం, రఫేల్ వంటి కీలక కేసులను విచారించారు. కేంద్రం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తూ నిన్న అధికారిక ప్రకటన వెలువరించింది. రాష్ట్రపతి కోటాలో ఆయనను పెద్దల సభకు పంపాలని నిర్ణయం తీసుకుంది.