పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)కి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి వామపక్షాలు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. జనవరి 8న బంద్ పాటించాలని వెల్లడించాయి.
ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్-లెనినిస్ట్)-లిబెరేషన్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు.. సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కార్మిక సంఘాలకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశాయి.
" జనవరి 8న 'గ్రామీణ్ బంద్'కు పిలుపునిచ్చిన రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు, పౌర సమాజ ఉద్యమానికి వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. భారత రాజ్యాంగంపై దాడి చేసేందుకు తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా శక్తిమంతమైన నిరసనలు చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి."