వచ్చే ఏడాది జరగనున్న బంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఒకవైపు సాధారణ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు చెక్ పెట్టాలని భాజపా వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు వరుస పరాజయాలతో కసిగా ఉన్న కాంగ్రెస్ బంగాల్లో పట్టునిలుపుకోవాలని ఆశ పడుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలు- కాంగ్రెస్ కూటమే.. టీఎంసీకి ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తిక విషయాలను వెల్లడించారు.
కలిసి ప్రచారం చేస్తాం..
బంగాల్ ప్రజలకు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తాం. కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా నియమితులైన జితిన్ ప్రసాద్ త్వరలోనే వామపక్ష నేతలతో మాట్లాడుతారు.
కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి..
ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన క్షేత్ర, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్లో.. అంతర్గత సంక్షోభం తలెత్తి, అసంతృప్తితో పలువురు నేతలు పార్టీ వీడారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి.
బంగాల్ ఎన్నికల్లో భాజపా వ్యూహం ఏంటని అనుకుంటున్నారు..
రాష్ట్ర రాజకీయాల్లో భాజపా, టీఎంసీలే ప్రధాన పార్టీలని సృష్టించడానికి కాషాయ దళం ప్రయత్నిస్తోంది. అది ఎప్పటికీ జరగదు. అయితే గవర్నర్, కేంద్ర సంస్థలు సహా అందుబాటులో ఉన్న అన్ని వనరులను భాజపా ఉపయోగించుకుంటోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినట్లు సృష్టించాలని ప్రయత్నిస్తోంది.