మహారాష్ట్ర వార్దాలోని హింగాన్ఘాట్లో గత వారం(ఫిబ్రవరి 3) పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కళాశాల లెక్చరర్ ఇవాళ మృతి చెందింది. కాలిన దేహంతో చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.55 గంటలకు మరణించినట్లు ఆరెంజ్ సిటీ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ఆమె మరణవార్త విన్న కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ కేసులో త్వరగా న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
"నిర్భయ కేసులాగా ఆలస్యం చేయకుండా త్వరగా కేసు విచారణ జరిపి సత్వర న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను"
- బాధితురాలి తండ్రి.
లెక్చరర్ మృతి పట్ల మహారాష్ట్ర మఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఇతర మంత్రులు స్పందించారు.
"ఈ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుంది. హింగాన్ఘాట్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మా ప్రభుత్వం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోచ్చిన దిశ చట్టాన్ని అధ్యయనం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలను మరింత కఠినం చేయటానికి ప్రయత్నిస్తున్నాము."
-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.
దిశ చట్టం ప్రకారం లైంగిక వేధింపుల కేసు నమోదైన రోజు నుంచి 7 పనిదినాల్లో విచారణను పూర్తి చేసి, 14 పని దినాల్లో కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేసేలా చట్టాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం.