సుప్రీంకోర్టులో భౌతిక కార్యకలాపాలను జులైలో పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం(ఎస్సీఏఓఆర్ఏ) కోరింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొబ్డేకు వినతి పత్రం అందించారు న్యాయవాదులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
"సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్లోని 95 శాతం డిజిటల్ వాదనలపై సంతృప్తికరంగా లేము. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవాదులు సాక్ష్యాలను సమర్థంగా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవుల తర్వాత జులైలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు పునరుద్ధరించాలి. అన్లాక్ 1.0 లో భాగంగా దశలవారీగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి."
- శివాజీ జాదవ్, ఎస్సీఏఓఆర్ఏ అధ్యక్షుడు
ఈ వినతి పత్రంలో వీడియో కాన్ఫరెన్స్ సమయంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ప్రస్తావించారు. మరికొన్ని సూచనలు కూడా చేశారు.
- వీడియో, ఆడియా నాణ్యత లేమి కారణంగా వాదనలను స్పష్టంగా చేయలేకపోతున్నామని తెలిపారు.
- చాలా కేసులు నిలిచిపోవటం వల్ల న్యాయవాదులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టులో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమైతేనే ఈ పరిస్థితులు అదుపులోకి వస్తాయి.
- కరోనా ముప్పు పొంచి ఉన్న కారణంగా పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చి.. భద్రతా ప్రమాణాలను సూచించవచ్చు. కక్షిదారులు, సాక్ష్యులు, న్యాయవిద్యార్థుల ప్రవేశంపైనా పరిమితులు విధించవచ్చు.
- కొత్తగా తీసుకొచ్చిన ఈ- ఫైలింగ్ మాడ్యూల్ సాఫ్ట్వేర్ ద్వారా వ్యక్తిగత సేవలను న్యాయవాదులకు అందించవచ్చు.
దేశంలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు మార్చి 25 నుంచి లాక్డౌన్ విధించారు. ఫలితంగా సుప్రీంకోర్టు అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారిస్తోంది.
ఇదీ చూడండి:'భౌతిక దూరమే' ఆ గిరిజనుల సంప్రదాయం!