తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: హరియాణాలో మళ్లీ కమల వికాసం- కుదిరిన పొత్తు - 6 సీట్ల దూరంలో భాజపా

జేజేపీకి డిప్యూటీ సీఎం...

By

Published : Oct 25, 2019, 12:01 PM IST

Updated : Oct 25, 2019, 9:47 PM IST

21:32 October 25

జేజేపీకి డిప్యూటీ సీఎం...

భాజపా-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖరారైన నేపథ్యంలో ముఖ్యమంత్రి భాజపా నుంచే ఉండనున్నారని అమిత్​ షా స్పష్టం చేశారు. అయితే జేజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్లు తెలిపారు. 

21:22 October 25

కుదిరిన పొత్తు...

హరియాణాలో జేజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమలదళపతి అమిత్​ షాతో ప్రకటించారు. జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలాతో భేటీ అనంతరం అమిత్​ షా ఈ ప్రకటన చేశారు. జేజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. 

20:45 October 25

డిప్యూటీ సీఎంగా దుష్యంత్!​

జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలా... భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షాతో భేటీ అయ్యారు. జేజేపీ డిమాండ్లకు అమిత్​ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దుష్యంత్​కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

19:39 October 25

హరియాణాలో సర్కారు ఏర్పాటు.. దిల్లీలో మంతనాలు

హరియాణా రాజకీయాలు దిల్లీకి మారాయి. హరియాణాలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు సీనియర్​ నేతలు అమిత్​ షా నివాసానికి చేరుకున్నారు. హరియాణా సహా మహారాష్ట్ర ఎన్నికలపై అగ్రనేతలు చర్చించే అవకాశముంది.

17:26 October 25

జేజేపీపైనే కాంగ్రెస్​ ఆశలు

జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలా మీడియా సమావేశంపై స్పందించారు కాంగ్రెస్​ నేత భూపిందర్​ హుడా. దుష్యంత్​ 'అజెండా' తమ పార్టీ మేనిఫెస్టోలో ఉందని హుడా స్పష్టం చేశారు. ఇతర సూచనలు ఏవైనా ఉంటే... దుష్యంత్​తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 

16:01 October 25

మద్దతుపై జేజేపీ అస్పష్టత

హరియాణా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జననాయక్​ జనతా పార్టీ నేత దుష్యంత్​ చౌతాలా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏ పార్టీకి మద్దతివ్వాలన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు దుష్యంత్​. తమ అజెండాను అంగీకరించిన వారికే మద్దతిస్తామని తెలిపారు.

చౌతాలా వ్యాఖ్యలు...

  • ఇప్పటివరకు ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదు
  • ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
  • యువతకు ఉపాధి కల్పనే మా ప్రధాన అజెండా
  • ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారో వారికే మా మద్దతు

14:59 October 25

భాజపా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం!

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమైంది. ఎన్నికల్లో సాధారణ మెజార్టీ సాధించడంలో విఫలమైనప్పటికీ స్వతంత్రుల మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌.. మరోసారి అధికార పీఠాన్ని అధీష్టించనున్నారు. భాజపాకు మద్దతిస్తామని ఏడుగురు స్వతంత్రులతోపాటు హరియాణా లోక్‌హిత్‌ ఎమ్మెల్యే ప్రకటించగా.. రేపు ముఖ్యమంత్రిగా ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. 
 

13:53 October 25

భాజపాకు ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు

ఇప్పటి వరకు ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు భాజపాకు తమ మద్దతు ప్రకటించారు. ధరమ్​పాల్​ గొండన్​, నాయన్​పాల్​ రావత్​, సోంబిర్​ సంగ్వాన్​, రాకేశ్​ దౌలతాబాద్​, రణ్​ధీర్​ గోలన్​.. ప్రభుత్వ ఏర్పాటులో కాషాయ దాళానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. దీని వల్ల పూర్తి మెజారిటీకి అడుగు దూరంలో నిలిచింది భాజపా. మిగిలిన ముగ్గురు స్వతంత్రుల్లో ఒక్కరు మద్దతు ప్రకటించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఆధిక్యం కమలం పార్టీకి దక్కుతుంది.

12:45 October 25

ప్రభుత్వ ఏర్పాటు దిశగా భాజపా!

హరియాణాలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాషాయ దళం తలుపుతట్టి తమ మద్దతు ప్రకటించారు. మెజారిటీకి భాజపా మరో రెండు సీట్ల దూరంలో ఉంది. మిగిలిన నలుగురు(మొత్తం 8మంది) స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఇద్దరు భాజపాకు మద్దతు ప్రకటించినా సులభంగా ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. 

భాజపాకు జేజేపి మద్దతు ప్రకటిస్తే.. కమలం పార్టీ బలం మరింత పెరుగుతుంది. ఒకవేళ జేజేపీ మద్దతు ప్రకటించకపోయినా.. స్వతంత్రులతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. 

దుష్యంత్​ చౌతాలా కాంగ్రెస్​కు మద్దతు ప్రకటించినా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. జేజేపీతో కలుపుకున్నా కాంగ్రెస్​కు 41 సీట్లు మాత్రమే వస్తాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 5 సీట్లు కావాల్సి వస్తుంది.

12:39 October 25

కాంగ్రెస్​ పరిస్థితి ఏంటీ?

హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తదుపరి వ్యూహరచనపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 17 మందితో పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ.. అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో భేటీ అయ్యింది. ఎన్నికల ఫలితాలు, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో అనుసరించాల్సిన వ్యూహం సహా కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం గురించి కూడా భేటీ చర్చించింది.

12:31 October 25

భాజపా తలుపుతట్టిన ముగ్గురు స్వతంత్రులు

హరియాణాలో స్వతంత్ర ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు భాజపా వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ముగ్గురు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాను కలిసినట్టు ఆ పార్టీ నేత జవహర్​ యాదవ్​ తెలిపారు.

ఒక వేళ ఈ ముగ్గురు కాషాయ దళానికి మద్దతు ప్రకటిస్తే... భాజపా సంఖ్య 43కు చేరుతుంది. దీని ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ మూడు సీట్ల దూరంలో ఉండనుంది.

12:19 October 25

సాయంత్రం 4 గంటలకు వీడనున్న ఉత్కంఠ!

హంగ్​ ఏర్పడిన నేపథ్యంలో కింగ్​మేకర్​గా మారిన దుష్యంత్​ చౌతాలా... ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఏ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తారనే అంశంపై ఈ సమావేశం ద్వారా స్పష్టత వచ్చే అవకాశముంది. విలేకరుల సమావేశానికి ముందు తీహార్​ జైలులో ఉన్న తన తండ్రి అజయ్​ చౌతాలాతో సమావేశంకానున్నారు దుష్యంత్​.

ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడం వల్ల కింగ్​మేకర్​గా మారింది జేజేపీ. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత దుష్యంత్​ చౌతాలాతో భాజపా, కాంగ్రెస్​ మంతనాలు ముమ్మరం చేశాయి. 

12:06 October 25

షాతో ఖట్టర్​... తండ్రితో దుష్యంత్​

రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠగా మారడం వల్ల అగ్రనేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఖట్టర్​... భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. తదుపరి కార్యచరణపై చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు కింగ్​మేకర్​ దుష్యంత్​ చౌతాలా... తీహార్​ జైలులో ఉన్న తన తండ్రి అజయ్​ చౌతాలాను మరికొద్ది గంటల్లో కలవనున్నారు. వీరి మధ్య జరిగే చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

12:05 October 25

చర్చలు, సంప్రదింపులు, మంతనాలు

హరియాణాలో మొత్తం శాసనసభ సీట్లు 90. భాజపా 40, కాంగ్రెస్​ 31, జేజేపీ 10 సీట్లు దక్కించుకున్నాయి. స్వంతంత్ర అభ్యర్థులు 8చోట్ల గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 46.

మెజారిటీకి కేవలం 6 సీట్ల దూరంలో నిలిచింది భాజపా. ఈ నేపథ్యంలో కాషాయ దళం జేజేపీ తలుపుతట్టింది. 10మంది ఎమ్మెల్యేలున్న జేజేపీని చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తీవ్రంగా శ్రమిస్తోంది.
 

11:44 October 25

హంగ్​: హరియాణాలో ఏం జరుగుతోంది?

హరియాణాలో భాజపా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దిల్లీలోని హైకమాండ్​తో ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పటికే భాజపాకు మద్దతు తెలిపారు.

గురువారం వెలువడిని ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకి కేవలం 6 స్థానాల దూరంలో నిలిచింది కాషాయ దళం. కాంగ్రెస్​ 31 సీట్లు సంపాదించింది. హంగ్​ ఏర్పడిన నేపథ్యంలో జేజేపీ(10) సహా స్వతంత్ర్య అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారు.
 

Last Updated : Oct 25, 2019, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details