తెలంగాణ

telangana

'మహా' పోరు: నవ మహారాష్ట్ర దిశగా అడుగులు!

By

Published : Oct 10, 2019, 2:02 PM IST

Updated : Oct 10, 2019, 5:33 PM IST

మహారాష్ట్ర శాసనసభకు త్వరలో జరిగే ఎన్నికలు ఓ కొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించనున్నాయి. ముఖ్య నాయకులు ఎవరూ పైకి అనకపోయినా జరుగుతున్న పరిణామాలు ‘నూతన మహారాష్ట్ర’ దిశగా అడుగులు పడుతున్నట్లుగానే కనిపిస్తున్నాయి. దూకుడుగా ఉండే శివసేన... ఇప్పుడు కాస్త మెత్తబడింది. భాజపా నాయకులూ మనసు మార్చుకున్నారు. ఇంకా రాష్ట్రాన్ని శాసించే కొన్ని ముఖ్యకుటుంబాలకు చెందిన నాయకుల వారసులతో పాటు మరికొందరు యువనేతలు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు.

'మహా' పోరు: నవ మహారాష్ట్ర దిశగా అడుగులు

'మహా' పోరు: నవ మహారాష్ట్ర దిశగా అడుగులు!

మహారాష్ట్రలో రసవత్తర పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. భాజపా-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్​-ఎన్​సీపీ మరో పొత్తుగా ఎన్నికల రణరంగానికి సిద్ధమయ్యాయి. అయితే.. గతంతో పోలిస్తే 'మహా' ఎన్నికలకు ముందు ఎన్నో మార్పులొచ్చాయి.

ఫైర్‌ బ్రాండ్‌ రాజకీయాలకు సంకేతంగా నిలిచే శివసేన ఇప్పుడు ఒద్దికగా భాజపాతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతోంది. సీట్ల సర్దుబాటులో తమకూ సగం స్థానాలు ఇచ్చి తీరాల్సిందే అన్న వైఖరి నుంచి కొన్ని సీట్లు తగ్గినా అధికారం కోసం మనసు మార్చుకుంది. అలాగే శివసేనపై విమర్శల వర్షం కురిపించిన భాజపా నాయకులు కూడా అవి మరచిపోయి స్నేహహస్తం అందించారు. అలాగే మహారాష్ట్రను శాసించే కొన్ని ముఖ్యకుటుంబాలకు చెందిన నాయకుల వారసులతోపాటు మరికొందరు యువ నేతలు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.

మనసు మార్చిన 2019 ఎన్నికలు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత భాజపా, శివసేన పార్టీల ధోరణిలో మార్పు కనిపించింది. మాఫియాలకు నిలయంగా పేర్కొన్న మాతోశ్రీకి స్వయంగా అమిత్‌షా వచ్చి స్నేహహస్తం అందించారు. మొఘల్‌ సర్దారని విమర్శించిన శివసేన నాయకులే ఇప్పుడు అమిత్‌ భాయ్‌ అంటూ ఆలింగనం చేసుకుంటున్నారు. అంతే కాదు శివసేన తన శ్రేణులకు రాజీ మంత్రాన్ని ఉపదేశించడం ప్రారంభించింది.

ఇలా తగ్గారు...

ఎన్నికల ప్రకటన విడుదలయ్యే వరకూ కూడా భాజపా, శివసేనలు చెరో 144 స్థానాల్లో పోటీ చేస్తాయని ఉద్ధవ్‌ ఠాక్రే చెబుతూ వచ్చారు. ముఖ్యమంత్రి పదవిని కూడా ఉభయ పార్టీలు చెరో రెండున్నరేళ్లూ పంచుకుంటాయన్నారు. అయితే ఇప్పుడు ఆయన తగ్గారు. భాజపా 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని 124 స్థానాల్లో పోటీకే పరిమితమై సంతృప్తి పడాల్సి వచ్చింది.

ఎక్కువ స్థానాల్లో భాజపా పోటీ చేస్తుండటం.. విజయావకాశాలు కూడా మెరుగ్గా ఉండటంతో ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలన్న శివసేన కల కూడా కలలాగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. అంటే ఫైర్‌ బ్రాండ్‌ రాజకీయాలు నెరిపిన వారు ఇప్పుడు ఇలా సర్దుకుపోతూ అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధపడటం‘‘కొత్త మహారాష్ట్ర’’కు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వారసులొస్తున్నారు...

  • అనేక మంది ముఖ్య నాయకులు తమ వారసులతో ఈ ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేయించారు.. మహారాష్ట్ర రాజకీయాలను శాసించే కొన్ని రాజకీయ కుటుంబాలు తమతో పాటు తమ సమీప బంధువులకు టికెట్లు ఇప్పించుకొని వారిని ఎన్నికల బరిలో నిలిపాయి.
  • శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తన తనయుడు ఆదిత్య(29)ను వర్లీ స్థానం నుంచీ పోటీకి నిలిపిన విషయం తెలిసిందే.
  • ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్న కుమారుడు రోహిత్‌ పవార్‌ కూడా ఈ ఎన్నికల్లో కర్జాత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీకి ఆయన కొత్తతరం నాయకుడనే ప్రచారం ఉంది.
  • ఎన్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ తత్కరే కుమార్తె అదితి కూడా ఇప్పుడు శాసనసభకు పోటీ చేస్తోంది.
  • కొల్హాపుర్‌ ప్రాంతంలో పట్టు ఉన్న కాంగ్రెస్‌ నాయకుడు సతేజ్‌ పాటిల్‌ తన మేనల్లుడు రుతురాజ్‌ పాటిల్‌ను ఎన్నికల బరిలో నిలిపారు.
  • భాజపాకు చెందిన కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్‌ దన్వే కూడా తన కుమారుడు సంతోష్‌కు ఈసారి పోటీ చేసేందుకు టికెట్‌ ఇప్పించుకున్నారు.

పాత వారినీ పక్కన పెట్టేశారు..

ప్రక్షాళన పేరుతో కొందరు సీనియర్‌ నాయకులను కూడా పక్కన పెట్టడం ఈ ‘‘నవ మహారాష్ట్ర’’లో భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాంటి కారణాలూ చెప్పకుండానే ఐదుగురు మంత్రులకు మరోసారి పోటీ చేసే అవకాశాన్ని భాజపా ఇవ్వలేదు. దేవేంద్ర ఫడణవీస్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన కారణంగానే వీరిని పక్కన పెట్టారనే మాట వినిపిస్తోంది. ఏక్‌నాథ్‌ ఖద్సే లాంటి నాయకులకూ టికెట్లు ఇవ్వకపోవడం నవ మహారాష్ట్ర రాజకీయంలో భాగమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

ప్రచారంలో ఎవరేమన్నారంటే..

''దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారిలో ఒక్కరినీ ఉండనివ్వబోము. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోగా అక్రమ వలసదారులందరినీ పంపేస్తాం. కాంగ్రెస్‌ నాయకులు ప్రతి దాన్నీ విమర్శిస్తున్నారు. రఫేల్‌ యుద్ధవిమానాలకు పూజలు చేసినా ఆక్షేపిస్తున్నారు. వారికి ప్రతీదీ తమాషాగా మారింది. భారతీయ సంస్కృతి కంటే ఇటలీ సంస్కృతే వారికి ఎక్కువగా తెలుసు. కాంగ్రెస్‌ తదితర పార్టీలు దేశాన్ని చెదలు మాదిరిగా తినేస్తున్నాయి.''
- భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా

''మహారాష్ట్రలో ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోలేదు. సైన్యం విజయాలు సాధిస్తే వారి పేరు చెప్పి ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఇలా చేయలేదు. యుద్ధంలో విజయం సాధిస్తే ఆ ఘనత సైన్యానికే చెందుతుందని ప్రకటించారు. నేను ఇంకా యువకుడినే.''
- ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌

''కాంగ్రెస్‌ ఎన్సీపీలు ఇప్పటికే ఓటమిని అంగీకరించినట్లైంది. రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్‌ ఇప్పటికే సగం ఖాళీ అయింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరవాత మొత్తం ఖాళీ అవుతుంది.''

- ఫడణవీస్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

''కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు విలీనమవుతాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సుశీల్‌కుమార్‌ శిందే చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం.''
- ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్‌

నాడు మాటల తూటాలు..

మూడేళ్ల నుంచి శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే భాజపాపై నిప్పులు చెరగడం మొదలు పెట్టారు. 25 ఏళ్ల పాటు భాజపాతో కలిసి సాగిన తమ యాత్రకు కాలం చెల్లిందని తీవ్ర పదజాలంతో విమర్శించారు. భాజపాతో పొత్తు పెట్టుకోబోనంటూ తెగేసి చెప్పారు. ఆ తరవాత కూడా భాజపాపై శివసేన విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. భాజపా అధ్యక్షుడు అమిత్‌షాను మొఘల్‌ సర్దార్‌గానూ కేంద్ర ప్రభుత్వాన్ని మొఘల్‌ సామ్రాజ్యంగానూ అభివర్ణించింది.

భాజపా కూడా అంతే..

శివసేనపై భాజపా నాయకులు కూడా అదే స్థాయిలో విమర్శల దాడి చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీని మాఫియాల నిలయంగా పేర్కొన్నారు. శివసేన అవినీతిలో కూరుకుపోయిందంటూ స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శలు సంధించారు.

భాజపా ఖాతాలో రెండు రాజ్యసభ స్థానాలు

పట్నా,లఖ్‌నవూ: బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాష్ట్రాల్లోని రెండు రాజ్యసభ స్థానాలను బుధవారం జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. బిహార్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి రామ్‌ జెఠ్మలానీ మరణించడంతో ఆ స్థానం ఖాళీ అవగా భాజపాకు చెందిన సతీష్‌ చంద్ర దూబే ఎన్నికయ్యారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మరణం కారణంగా ఖాళీ అయిన యూపీలోని రాజ్యసభ స్థానం నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది గెలుపొందారు.

Last Updated : Oct 10, 2019, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details