కొన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) ముఖ్య భాగాలు మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఉన్న స్ట్రాంగ్ రూముల నుంచి మాయమయ్యాయని తాజా తనిఖీలో తేలింది. బ్యాలెట్ యూనిట్, డిటాచబుల్ మెమరీ మాడ్యూల్(డీఎంఎం) లాంటి ముఖ్యమైన భాగాలు కనిపించకుండా పోయాయనే విషయం సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైంది. అయితే ఎక్కడ వినియోగించిన ఈవీఎం భాగాలు మాయమయ్యాయో కచ్చితంగా బహిర్గతం కాలేదు.
ఈవీఎంల భద్రత, నిర్వహణలపై జిల్లా యంత్రాంగాల నుంచి వచ్చిన తాజా నివేదికలను తెలియజేయాలని అజేయ్ దూబే అనే వ్యక్తి దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తు మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యలో తనిఖీలు చేపట్టిన వివరాలను తెలియజేసింది.
ఈవీఎంల సమాచారాన్ని నిల్వ చేసుకునేందుకు అదనంగా ఉండే మరో సాధనమే డిటాచబుల్ మెమరీ మాడ్యూల్(డీఎంఎం). దీన్ని కావాలంటే ఈవీఎంల నుంచి వేరు చేసే సదుపాయం ఉంటుంది.
నర్సింగ్పుర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో మొత్తం 2,709 డీఎంఎంలు భద్రపరిస్తే.. అందులో 2,508 కనిపించలేదని తనిఖీల్లో తేలినట్టు మాస్టర్ స్టాక్ రిజిస్టర్ ద్వారా వెల్లడైంది. అయితే 687 డీఎంఎంలను ఎన్నికల్లో వినియోగించలేదని, అందుకే ఎన్నికల సంఘానికి తిప్పిపంపినట్టు నర్సింగ్పుర్ జిల్లా అధికారులు తెలిపారు. స్ట్రాంగ్ రూములో 201 జీఎంఎంలు ఉన్నాయని చెబుతూనే, కనిపించకుండా పోయిన వాటి వివరాలపై పెదవి విప్పలేదు.